
అగ్నికణం ఐలమ్మ
ఐలమ్మ జీవితం..
పాలకుర్తి టౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ పాత్ర వీరోచితమైనది. ఆమె జీవితం ఇప్పటికీ అనేక పోరాటలకు ప్రేరణగా నిలుస్తోంది. భూమి, భుక్తి, పేదల బతుకుల విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం చాకలి ఐలమ్మ. అనేక మందికి విప్లవభావాలు మండించిన నిప్పుల కొలిమి ఐలమ్మ. విస్నూర్ దొర రాపాక రాంచంద్రారెడ్డి ఆగడాలపై అగ్నికణంలా మారి ముందుకు దూంకిన తొలి వీరనారి చాకలి ఐలమ్మ. తన పంటపొలాల్లో పండించిన ధాన్యం విషయంలో ప్రారంభించిన ఉద్యమం యావత్ తెలంగాణ జిల్లాలకు వ్యాపించింది. రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఎర్రజెండాను చేతపట్టి ప్రజలను సమీకరించి సాగించిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఐలమ్మ తన చాకలి వృత్తిలో ఆర్థికంగా నిలదొక్కు కోలేకపోయింది. దీంతో కుటుంబీకులు మల్లంపల్లి జమీందార్ ఉత్తంరాజు కొండల్‌రావు దగ్గర 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. దేశ్‌ముఖ్ ఏజెంట్ అయిన పాలకుర్తి పోలీసు పటేల్ వీరమనేని శేషగిరిరావు గ్రామంలో పెత్తనం చెలాయిస్తూ వెట్టి చేయించుకునే వాడు. ఓ రోజు పోలీస్ పటేల్ ఐలమ్మను, ఆమె భర్త నర్సయ్యను పశువులతో సహా వచ్చి తన వ్యవసాయ పొలంలో పనిచేయాలని ఆదేశించారు. అప్పటికే ఆంధ్ర మహాసభలో చేరిన ఐలమ్మ కుటుంబంపై కక్షగట్టి ఆంధ్ర మహాసభల్లో చేరిందని, నాయకులకు ఆశ్రయం కల్పించి అన్నం పెడుతోందని ఆరోపిస్తూ దాడులు చేయించారు. ఐలమ్మ భర్త నర్సయ్య, సంఘం నాయకులు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బీంరెడ్డి నర్సింహరెడ్డి, నల్లా నర్సింహులు, నల్లు ప్రతాప్‌రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావును తీసుకు వచ్చారు. పాలకుర్తి తదితర ప్రాంతాల్లో జరిగిన కొన్ని సంఘటనల్లో ఐలమ్మ, ఆమె భర్త నర్సయ్య, కుమారుడు సోమయ్య, లచ్చయ్యపై రాంచంద్రారెడ్డి కుట్ర కేసు పెట్టి జైలుకు పంపాడు. మల్లంపల్లి జమీందార్ కొండల్‌రావును దేశ్‌ముఖ్ పిలిపించి ఐలమ్మకు కౌలుకు ఇచ్చిన భూమిని తనకు కౌలుకు ఇచ్చినట్లుగా ఒక అగ్రిమెంట్ రాయించుకుని దానిని ఆధారంగా చేసుకుని ఐలమ్మ పంటను ధ్వంసం చేసేందుకు గుండాలను పంపించాడు. ఐలమ్మ పొలంలోని పంటను కాపాడుకునేందుకు బీంరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, గుండాలను అడుగుపెట్టనియ్యకుండా ప్రతిఘటించారు. ఐలమ్మ కుటుంబానికి ఆంధ్రమహాసభ అండగా నిలిచింది. ఐలమ్మ పోరాటం గురించి తెలుసుకున్న పుచ్చలపల్లి సుందరయ్య ఆమె ఇంటికివచ్చి ఇల్లునే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి ఇంటి ఆవరణలో అరుణపతాకాన్ని ఎగురవేశారు. ‘ఐలమ్మ భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటుకు చిహ్నంగా నిలిచిందని’ పుచ్చలపల్లి సుందరయ్య కొనియాడారు.
చాకలి ఐలమ్మ పేరుతో
స్మృతివనం ఏర్పాటు చేయాలి
హైదరాబాద్ సచివాలయం ఎదుట, ఢిల్లీ పార్లమెంట్‌లో ఐలమ్మ విగ్రహం పెట్టాలని, ఏదైనా జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని పలువురు కోరుతున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఐదెకరాల్లో ఐలమ్మ పేరుతో పార్కు, స్కృతివనం ఏర్పాటు చేయాలని ఐలమ్మ అభిమానులు కోరుతున్నారు.
భూస్వాములు, రజాకార్లను తరిమికొట్టిన వీరనారి
దేశ్‌ముఖ్‌లకు ముచ్చెమటలు
పట్టించిన ధీశాలి
నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి
ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26వ తేదీన రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామంలో జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో 1908లో తన 13వ యేటా వివాహం జరిగింది. వృద్ధాప్యంతో 90 ఏళ్ల వయస్సులో 1985, సెప్టెంబర్ 10న ఐలమ్మ కన్నుమూసింది. ఆమె పోరాటానికి చిహ్నంగా మండల కేంద్రంలో ఐలమ్మ స్మారక స్థూపం, భవనం, కాంస్య విగ్రహం నిర్మించారు.

అగ్నికణం ఐలమ్మ

అగ్నికణం ఐలమ్మ