
కదంతొక్కిన లంబాడీలు
హన్మకొండ : లంబాడీలు ఆత్మగౌరవ శాంతి ర్యాలీతో కదం తొక్కారు. ఎస్టీ హోదా పరిరక్షణకు లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవ ర్యాలీలకు పిలుపునిచ్చింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో మంగళవారం హనుమకొండ బాలసముద్రం ఏకశిలా పార్కు ఠాణూ నాయక్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు లంబాడీలు ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించ తలపెట్టారు. ర్యాలీ ఉందనే సమాచారంతో పోలీసు బలగాలు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నాయి. బారికేడ్లు అడ్డుపెట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, మహిళలతో పాటు లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఠాణూనాయక్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం కాగానే పోలీసులు వారిని వారించారు. అనుమతి లేదని ఇక్కడి నుంచి కదలవద్దని సూచించారు. అయినా ఆందోళనకారులు పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు పరిస్థితులు వివరించి సర్దిచెప్పడంతో శాంతించారు. ఠాణూనాయక్ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కోయ, గోండులకు చెందిన కొద్దిమంది రాజకీయ నాయకుల వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఆ రాజకీయ నాయకులపై
చర్యలు తీసుకోవాలి..
ఈ ర్యాలీ సందర్భంగా లంబాడీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ..లంబాడీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న కోయ, గోండు వర్గాలకు చెందిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని లంబాడీలను రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉందని, లంబాడీల ఎస్టీ రిజర్వేషన్లను కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేని వారు పేర్కొన్నారు. లంబాడీలను నిర్లక్ష్యం చేసిన, సుప్రీంకోర్టులో లంబాడీల పక్షాన కేంద్ర.,రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీల వ్యతిరేకమైన పార్టీలను బొందపెడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీల శాంతి ర్యాలీకి జిల్లా యంత్రాంగం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు.
కార్యక్రమంలో లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎల్–జేఏసీ) కన్వీనర్లు జాటోత్ కిషన్‌నాయక్, జైసింగ్ రాథోడ్, సమన్వయకర్త వి.ఎన్.నాయక్, నాయకులు రాజు నాయక్, అంగోత్ వినోద్, వాంకుడోత్ వీరన్న, పోరిక గోవింద నాయక్, వీరమ్మ, గోపిసింగ్, బానోత్ వసంత్ నాయక్, బానోత్ వెంకన్న నాయక్, డాక్టర్ ఉదయ్ సింగ్ నాయక్, నునావత్ జవహర్, బానోత్ మంగీలాల్, సమ్మయ్య రాథోడ్, లకావత్ కరుణాకర్, పాడియా గాంగు నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండలో లంబాడీల
ఆత్మగౌరవ శాంతిర్యాలీ
అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు
ఇరువర్గాల తోపులాట, స్పల్ప ఉద్రిక్తత
ఠాణూ నాయక్ విగ్రహం వద్ద ధర్నా
తమ ఎస్టీ హోదాను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే: లంబాడీ జేఏసీ