
కుటీర పరిశ్రమలకు తగ్గిన విద్యుత్ బిల్లులు
హన్మకొండ: కుటీర పరిశ్రమలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గింది. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎల్‌టీ కేటగిరీ–3 నుంచి ఎల్‌టీ కేటగిరీ–4కు కుటీర పరిశ్రమలను తీసుకొచ్చారు. దీంతో కుటీర పరిశ్రమ వినియోగదారులపై భారం తగ్గింది. 25 హెచ్‌పీ లోపు లోడ్ కలిగిన కుటీర పరిశ్రమలు ఈ కేటగిరీ–4లోకి వస్తాయి. 25 హెచ్‌పీ లోడ్‌కు పైన ఉన్న పరిశ్రమలు కేటగిరీ–3 కిందికి వస్తాయి. కేటగిరీ మారడంతో యూనిట్ చార్జీలు మారాయి. కేటగిరీ–3లో యూనిట్ చార్జీ రూ.7.70 ఉండగా కేటగిరీ–4లో యూనిట్ చార్జీ రూ.4గా ఉంది. అదే విధంగా ఫిక్స్‌డ్ చార్జీలు కిలో వాట్‌కు రూ.100 ఉండగా కేటగిరీ మార్పుతో రూ.20 తగ్గింది. యూనిట్ పరంగా చూస్తే రూ.3.70, కిలోవాట్ పరంగా రూ.80 భారం వినియోగదారులపై తగ్గింది. పవర్‌లూమ్స్, వడ్రంగి, కమ్మరి, కంచరి, గోల్డ్‌స్మిత్, శిల్పి, కొవ్వొత్తుల తయారీ, పాపడ్ లెదర్ వస్తువులు, చెప్పుల తయారీ, లాక్ టాయ్ మేకింగ్, పాప్ టాయ్స్, ప్లాస్టర్ ఆప్ పారిస్ ఉత్పత్తులు, బొమ్మల తయారీ పరిశ్రమలు, ఊరగాయల తయారీ, మామిడి జెల్లి యూనిట్లకు 25 కిలోవాట్లకు మించకుండా లోడ్ ఉన్న కుటీర పరిశ్రమలు మాత్రమే ఎల్‌టీ కేటగిరీ–3లోకి వస్తాయి.
కేటగిరీ మార్పు చేయించామని
దళారుల వసూళ్లు..
ఇదిలా ఉండగా తామే కేటగిరీ మార్పు చేయించి బిల్లులు తగ్గించామని చెబుతూ కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. ప్రధానంగా మడికొండ టెక్స్‌టైల్స్ పార్కు కేంద్రంగా కొందరు ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) కుటీర పరిశ్రమలపై భారం పడుకుండా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేటగిరీ మార్పు ద్వారా భారం తగ్గిస్తే కొందరు ఇదే అదనుగా సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, విద్యుత్ అధికారులు, సిబ్బంది పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి సూచించారు. విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతరులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటగిరీ మార్పు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. హనుమకొండ టౌన్ డివిజన్‌లోని 25 హెచ్‌పీకి తక్కువ లోడ్ ఉన్న కుటీర పరిశ్రమల వినియోగదారులు కేటగిరీ మార్పు, వివరాల కోసం డివిజన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ఎల్‌టీ కేటగిరీ–3 నుంచి
కేటగిరీ–4కు మార్పు
యూనిట్ ధర రూ.7.70 నుంచి రూ.4కు తగ్గింపు