
చరిత్రలో నిలిచేలా గద్దెల నిర్మాణాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మల కీర్తిప్రతిష్టను నిలబెడుదామని, వందేళ్ల అమ్మవార్ల చరిత్ర నిలిచేలా శాశ్వత నిర్మాణాలను చేపట్టేందుకు మేడారం మాస్టర్ ప్లాన్ రూపొందించిన్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం మేడారంలోని ఐటీడీఏ అతిథిగృహంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, పీఆర్‌శాఖ ఇంజనీరింగ్, దేవాదాయశాఖ, పూజారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్‌లో గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల డిజైన్‌ను అర్కిటెక్ బృందం ప్రొజెక్టర్ ద్వారా చూపించారు. గద్దెల ప్రాంగణంలోని అభివృద్ధి ప నుల ఏర్పాట్లపై సమీక్షించిన అనంతరం సీతక్క మాట్లాడారు. పూజారుల అభిప్రాయాలు, నిర్ణయా ల మేరకు గద్దెల ప్రాంగణంలో మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
ఈనెల, 13,14వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి మేడారానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో మంత్రి సీతక్క అధికారులతో కలిసి మేడారం వైజంక్షన్ సమీపంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీఎం సమావేశం నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. శివరాంసాగర్ సమీపంలోని వీఐపీ రోడ్డును సీతక్క పరిశీలించి, వరద కోతతో పైపులు బయటికి కనిపించడంతో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా వచ్చే వీఐపీ, వీవీఐపీల విశ్రాంతి కోసం హరితహోటల్‌ను పరిశీలించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీ డాక్టర్‌తో చర్చించారు. అనంతరం అమ్మవార్లను మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్, ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, అర్కిటెక్ బృందం పాల్గొన్నారు.
పూజారుల అభిప్రాయాల స్వీకరణ
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ స్థపతి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ శివనాగిరెడ్డి, అర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అధికారులు, దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు, పూజా రులు గద్దెల వద్దకు వెళ్లి మాస్లర్ ప్లాన్‌లో చేయాల్సిన మార్పులు,చేర్పులను అడిగి తెలుసుకున్నా రు. నూతన సాలహారంపై ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయల చిత్రాలు, పడిగలను ఏర్పాటు చేయాలని పూజారులు వివరించారు. బుధవారం ఫైనల్ మాస్టర్ ప్లాన్ డిజైన్‌ను రూపొందించాలని శివనాగిరెడ్డి అర్కిటెక్ డిజైనర్ల బృందానికి సూచించారు.
సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క
మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన