
నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యక్తిపై పీడీ యాక్ట్
వరంగల్ క్రైం: కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తూ పట్టుబడిన హైదరాబాద్‌లోని మెహిదీపట్నానికి చెందిన ముద్దంగుల ఆదిత్యపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పరకాల జైలులో ఉన్న నిందితుడు ఆదిత్యకు పరకాల ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీయాక్ట్ అందుకున్న నిందితుడు మరో ఆరుగురితో కలిసి ఒక ముఠా ఏర్పాటు చేశాడు. కాలం తీరిన పురుగు మందులను ఫర్టిలైజర్ డీలర్ల నుంచి తక్కువ డబ్బులకు కొనుగోలు చేయడంతో పాటు నకిలీ విత్తనాలు, పురుగు మందులను రైతులకు విక్రయిస్తూ గత జూన్ 6వ తేదీన పరకాల పోలీసులకు పట్టుబడినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై గతంలోనూ మట్టెవాడ, పరకాల పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు వివరించారు. రైతులకు నకిలీ విత్తనాలు, పురుగుల మందులను విక్రయించిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.