
సినీఫక్కీలో కిడ్నాప్..?
● డబ్బుల కోసం 32 ఏళ్ల యువకుడి హైడ్రామా
● ఐదు గంటల్లో కథ సుఖాంతం
రామన్నపేట : బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలయ్యాడు.. తల్లిదండ్రుల నుంచి ఎలాగైనా డబ్బులు లాగాలని తనకు తానే కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. అతనికి పరిచయమైన ఓ ఆటో డ్రైవర్‌తో తానే కిడ్నాప్ అయ్యి తన తండ్రికి రూ.10లక్షలు కావాలని ఫోన్ చేయించాడు. ఈ క్రమంలో సదరు యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన 32ఏళ్ల అదిల్ సోనీ జకోటియా కాంప్లెక్స్ సమీపంలో ఆటో స్పేర్ పార్ట్స్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విలాసాలతోపాటు బెట్టింగ్‌లకు అలవాటు పడి రూ.5లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఎలాగైనా అప్పు తీర్చాలని తనకు పరిచయమైన యాకూబ్ అనే ఆటో డ్రైవర్‌తో కిడ్నాప్ చేయాలని ప్రణాళిక రూపొందించుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం నిజమైన తరహాలో కిడ్నాప్ అయినట్లు సీసీ కెమెరాలకు చిక్కకుండా ఆటోలో కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ నటించారు. అక్కడినుంచి వెళ్లిన తర్వాత తన తండ్రి అశోక్ సోనీకి యాకూబ్ ఫోన్ చేసి శ్రీమీ కొడుకును కిడ్నాప్ చేశాం. రూ.పది లక్షలు కావాలి.. శాయంపేట జంక్షన్‌ను రావాలనిశ్రీ అని బెదిరించారు. ఈ విషయాన్ని అశోక్ సోనీ పోలీసులకు చెప్పడంతో అప్రమత్తమయ్యారు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా రాత్రి 9గంటల ప్రాంతంలో బృందాలుగా విడిపోయి చింతల్ వద్ద వారిని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. దీనిపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.