
సమస్యలు పరిష్కరించండి
బల్దియా గ్రీవెన్స్‌లో నగరవాసుల మొర
వరంగల్ అర్బన్ : తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలు కాలనీల వాసులు బల్దియా ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. సోమవారం గ్రేటర్ కౌన్సిల్ హాల్‌లో అధికారులు పలు సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులందాయి. కార్యక్రమంలో బల్దియా ఎస్‌ఈ మహేందర్, సీఈ రవీందర్ వాడేకర్, ీసీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● 3వ డివిజన్ పైడిపల్లి అయ్యప్ప కాలనీలో పదేళ్లుగా నివాసం ఉంటున్నామని, సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు.
● కాజీపేట మండలం కడిపికొండ రెవెన్యూ గ్రామంలో భూముల చుట్టూ ప్రహరీ నిర్మించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.
● 14వ డివిజన్ మణికంఠ కాలనీ రోడ్డు–2లో నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.
● 17వ డివిజన్ బొల్లికుంటలో రోడ్డు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
● 15వ డివిజన్‌లో వీధికుక్కలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● 11 డివిజన్‌లోని రోడ్డుపై మ్యాన్‌హోల్, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నారని విజ్ఞప్తి చేశారు.
● వంగపహాడ్ రోడ్డులో ఎత్తైన ర్యాంపు నిర్మించారని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
● 58వ డివిజన్ శ్రీనగర్ కాలనీ–2 అనుమతి లేకుండా డ్రెయినేజీ నిర్మిస్తున్నారని చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విన్నవించారు.