
పూల వ్యర్థాలు డ్రెయినేజీలో వేయొద్దు
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్ : పూల వ్యర్థాలను డ్రెయినేజీలో వేయకుండా వ్యాపారులకు అవగాహన కల్పించాలని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శానిటేషన్ తనిఖీల్లో భాగంగా మేయర్ సోమవారం వరంగల్ పోస్టాఫీస్ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోస్టాఫీస్ ప్రాంతంలో బల్దియా ఏర్పాటు చేసిన ఫ్లవర్ కంపోస్టు యూనిట్‌ను మేయర్ క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూలు, గుమ్మడికాయల వ్యాపారులతో మాట్లాడారు. ప్రధాన రహదారినుంచి సీకేఎం ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ఏర్పడిన లీకేజీని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకురాగా వెంటనే అరికట్టాలని ఏఈని ఆదేశించారు. అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఇటీవల పోస్టాఫీస్ ప్రాంతంలో వరద నీరు రోడ్డుపై చేరి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు కలిగిందన్నారు. డ్రెయినేజీల్లో పూల వ్యర్థాలు వేసి వరదనీరు ప్రవహించకుండా అడ్డుపడితే కార్పొరేషన్ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్పొరేటర్ చింతాకుల అనిల్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, రాజేష్, సంతోష్‌బాబు, భాస్కర్ పాల్గొన్నారు.