
పింఛన్లు పెంచే వరకు పోరాటం
వీహెచ్‌పీఎస్, సీపీహెచ్‌పీఎస్, ఎమ్మార్పీఎస్
ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
హన్మకొండ అర్బన్ : దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఇతరులకు రూ.4వేల పింఛన్ పెంచే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ వై.కే విశ్వనాథ్ మాదిగ, జిల్లా ఇన్‌చార్జ్ కందుకూరి సోమన్న హెచ్చరించారు. సోమవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్), చేయూత పెన్షన్‌దారుల హక్కుల పోరాట సమితి (సీపీహెచ్‌పీఎస్), ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 20 నెలలు గడుస్తున్నా పింఛన్ల పెంపుపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. ఈనెల 12వ తేదీన తహసీల్దార్ కార్యాలయాలు, 20వ తేదీన హైదరాబాద్ ఎల్‌బీనగర్ నుంచి కోదాడ వరకు జాతీయ రహదారిని దిగ్భందం చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులతో కలిసి కలెక్టర్ స్నేహశబరీష్‌కు అందజేశారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బండారి సురేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దూడల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సింగారపు స్వామి, కార్యదర్శి రాజు, వీహెచ్‌పీఎస్ జిల్లా మహిళా నాయకులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.