
రేపు అప్రెంటిస్‌షిప్ మేళా
హన్మకొండ: హనుమకొండ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ వరంగల్ క్యాంపస్‌లో ఈనెల 8న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రముఖ కంపెనీలు ఈమేళాలో పాల్గొంటున్నాయని తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెకానిస్ట్, వెల్డర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మేచినిస్ట్ గ్రాంస్‌డర్, కోపా ట్రేడ్లలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ మేళాలో పాల్గొనాలని కోరారు. ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఐటీఐ పాస్ సర్టిఫికెట్ తీసుకొని సోమవారం ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో హాజరుకావాలని కోరారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ చిర్రరాజు అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. డిగ్రీ కోర్సులో ఈవిద్యాసంవత్సరం తెలుగు ఫస్టియర్, సెకెండియర్ సిలబస్‌పై చర్చించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి పంపిన సిలబస్‌కు అనుగుణంగా యాథాతథంగా సభ్యులు ఆమోదించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ విభాగాధిపతి డాక్టర్ మామిడి లింగయ్య, అధ్యాపకులు డాక్టర్ సీతారాములు, డాక్టర్ ఎం.రమణ, హరీశ్ పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: సాహితీవేత్త స్వర్గీయ డాక్టర్ నమిలికొండ బాలకిషన్‌రావు స్మారక పురస్కారాన్ని నగరానికి చెందిన కవి పొట్లపల్లి శ్రీనివాసరావుకు అందజేయనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాన్. పాంచాలరాయ్, తెరసం ప్రధాన కార్యదర్శి బిల్ల మహేందర్ తెలిపారు. నబారా (నమిలికొండ బాలకిషన్‌రావు)ట్రస్ట్ సౌజన్యంతో వరంగల్ తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శనివారం నమిలికొండ బాలకిషన్‌రావు జయంతిని పురస్కరించుకుని సమావేశమయ్యారు. 2025 సంవత్సరానికి పలు కవితా సంపుటాలు వెలువరించి సాహితీసేవ చేస్తున్న కవి పొట్లపల్లి శ్రీనివాసరావుకు త్వరలో నిర్వహించే కార్యక్రమంలో స్మారక పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు నిర్ణయించారు. హనుమకొండలోని నక్కలగుట్టలో జరిగిన ఈకార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్మోహన్‌రావు, తెరసం సభ్యులు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: గత నెల 30, 31వ తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ మీట్‌లో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న బాలికలను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రశంసించారు. కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 23నుంచి 25 వరకు గుంటూరులో జరగనున్న సౌత్‌జోన్ నేషనల్ మీట్‌కు ఎంపికై నట్లు క్రీడాకారిణులు కలెక్టర్‌కు తెలిపారు. అథ్లెట్ల వెంట డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్, క్రీడా సంఘాల బాధ్యులు రమేశ్‌రెడ్డి, నాగకిషన్, సారంగపాణి, కోచ్‌లు శ్రీమన్నారాయణ, రమేశ్, నాగరాజు ఉన్నారు.
హన్మకొండ కల్చరల్: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం వేయిస్తంభాల ఆలయాన్ని ద్వారబంధనం చేస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ శనివారం ఒకప్రకటనలో తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

రేపు అప్రెంటిస్‌షిప్ మేళా