దొడ్డు బియ్యం ఎలుకల పాలు! | - | Sakshi
Sakshi News home page

దొడ్డు బియ్యం ఎలుకల పాలు!

Sep 6 2025 4:25 AM | Updated on Sep 6 2025 4:25 AM

దొడ్డ

దొడ్డు బియ్యం ఎలుకల పాలు!

ఐదు నెలలుగా రేషన్‌ షాపుల్లో నిల్వ

లక్కపురుగు పట్టి, ముక్కిపోతున్న రైస్‌

తరలించేందుకు ప్రభుత్వం నుంచి

ఆదేశాలు రాలేదంటున్న అధికారులు

ఖిలా వరంగల్‌: చౌకధరల దుకాణాల్లో ఈ ఏడాది మార్చి వరకు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేశారు. ఏప్రిల్‌ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో రేషన్‌ దుకాణాల్లో ఐదు నెలలుగా దొడ్డు బియ్యం నిల్వలు వృథాగా ఉంటున్నాయి. చాలాచోట్ల వీటికి లక్కపురుగు పట్టడంతోపాటు ముక్కిపోతున్నాయి. ఎలుకలు బస్తాలు కొరికి బియ్యం కుప్ప పోస్తున్నాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఇలాగే ఉంచితే పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా 509 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆహార భద్రతాకార్డు (ఎఫ్‌ఎస్‌సీ) ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోలు, అంత్యోదయ ఆహార భద్రతాకార్డు (ఏఎఫ్‌ఎస్‌సీ)కు 35 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంది. కోటా కేటాయింపులో ఆలస్యం కారణంగా ఈ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కార్డుదారులు రాష్ట్రంలో ఏ దుకాణంలోనైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉండడంతో కొంతమంది డీలర్లు లబ్ధి పొందుతుంటే, మరికొంతమంది నష్టపోతున్నారు.

అద్దె ఇళ్లలో షాపులు..

జిల్లాలో 85 శాతం రేషన్‌షాపులు అద్దె ఇళ్లలోనే కొనసాగుతున్నాయి. అవి కూడా చిన్నగా ఉండడం, వాటిలోనే దొడ్డు బియ్యం నిల్వలు ఉంచడంతో డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయడంతో 60 రోజులకు పైగా డీలర్లు దుకాణాలు తెరవలేదు. దీంతో నిల్వ ఉన్న బియ్యం ఎలా ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. జిల్లాలో సుమారు 32 వేల క్వింటాళ్ల దొడ్డు బియ్యం నిల్వలున్నట్లు తెలుస్తోంది. వీటిని ఎప్పుడు తరలిస్తారో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇప్పటికే ఐదు నెలలు గడిచింది. ఎక్కువ సమయం అలాగే ఉంచితే చేతికి వచ్చే పరిస్థితి లేదు. వాటిలో ఇప్పటికే దుమ్ము, పురుగులు కనిపిస్తున్నాయి. దొడ్డు బియ్యం నిల్వలు ఉండడంతో సన్నబియ్యం ఉంచేందుకు స్థలం లేక అదనపు గదులు అద్దెకు తీసుకొని ఆర్థికంగా నష్ట పోతున్నామని డీలర్లు చెబుతున్నారు. వీలైనంత త్వరగా దొడ్డు బియ్యాన్ని ఖాళీ చేయించి విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈవిషయమై పౌర సరఫరాల అధికారులను వివరణ కోరగా దొడ్డు బియ్యం వెనక్కి తీసుకోవాలనే విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

దొడ్డు బియ్యం ఎలుకల పాలు!1
1/1

దొడ్డు బియ్యం ఎలుకల పాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement