
‘గ్రేటర్’లో భక్తిపారవశ్యంతో వినాయక శోభాయాత్ర
వరంగల్ అర్బన్: ‘గణేశ్ మహరాజ్‌కు జై’ అంటూ.. గణనాథులను గంగమ్మ ఒడికి చేర్చారు నగరానికి చెందిన భక్తజనులు. అత్యంత భక్తి శ్రద్ధలతో వరంగల్ మహా నగర ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రతీ వీధిలో కొలువైన వినాయకులను వాహనాలపై డప్పు చప్పళ్లతో ఊరేగింపుగా యువకులు, పిల్లలు, మహిళలు, పెద్దలు నృత్యాలు, కోలాటం చేస్తూ, రంగులు చల్లుకుంటూ నగరానికి సమీపంలో ఉన్న 19 చెరువుల్లో నిమజ్జనం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలై అర్ధరాత్రి వరకు నిమజ్జనం కొనసాగింది. గ్రేటర్ వరంగల్ పరిధిలో చిన్నవడ్డేపల్లి చెరువు, గొర్రెకుంట కట్టమల్లన్న, ఖిలా వరంగల్ అగర్తలా, బెస్తం చెరువు, ఉర్సు రంగ సముద్రం, హనుమకొండలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్‌పర్తి పెద్ద చెరువు, మడికొండ చల్లా చెరువు, భీమారం, గోపాలపురం చెరువులతోపాటు విలీన గ్రామాల్లో మరో 9 చెరువుల్లో, చిన్న కుంటల్లో గణేశ్ ప్రతిమల్ని నిమజ్జనం చేశారు.
ప్రారంభించిన మేయర్, కలెక్టర్, కమిషనర్
గణేశ్ నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. శుక్రవారం వరంగల్ పరిధి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద మొక్కులు సమర్పించి, కొబ్బరి కాయ కొట్టి నిమజ్జనాన్ని మేయర్, కలెక్టర్ సంయుక్తంగా ప్రారంభించారు. శోభాయాత్ర, నిమజ్జనాలను మేయర్ గుండు సుధారాణి సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీపీసీ) సెంటర్‌నుంచి పర్యవేక్షించారు. నోడల్ అధికారులతో మొబైల్ ఫోన్‌లో మాట్లాడి అప్రమత్తం చేశారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను, నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్ర నిర్వహించే మార్గాల్లోని స్థితిగతులను సీపీ సన్‌ప్రీత్‌సింగ్ పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌నుంచి పర్యవేక్షించారు. నిమజ్జనం, శోభాయాత్ర కోసం ఏర్పాటు చేసిన 583 సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు తిలకిస్తారని సీపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేశ్ జోషి, కావేటి కవిత, బస్వరాజు కుమారస్వామి, డీసీపీ షేక్ సలీమా, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఏసీపీ శుభం, ఇరిగేషన్ బల్దియా ఈఈలు కిరణ్, భీమ్‌రావు ఏంహెచ్‌ఓ రాజేశ్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తహసీల్దార్ ఇక్బాల్ పాల్గొన్నారు.
గణపతులను
గంగమ్మ ఒడికి చేర్చిన భక్తజనం
నిమజ్జనాన్ని ప్రారంభించిన మేయర్,
కలెక్టర్, కమిషనర్
అధికారుల విస్తృత ఏర్పాట్లు

‘గ్రేటర్’లో భక్తిపారవశ్యంతో వినాయక శోభాయాత్ర