
నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి
నయీంనగర్: తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో గణపతి పూజలు నిర్వహించిన భక్తులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ నాయిని రాజేందర్ రెడ్డి సూచించారు. గురువారం గణపతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన గణపతి ఉత్సవ కమిటీలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వరంగల్ సీపీ, ఎమ్మెల్యే నాయిని, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులు అందజేశారు. పర్యావరణాన్ని కాపాడే మట్టి గణపతి ప్రతిమలు, సంస్కృతి సంప్రదాయాల ఆచరణ, నిత్యపూజా విధానాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 109 గణపతి మండపాలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గణపతి ఉత్సవ సమితి బాద్యులు జైపాల్ రెడ్డి, నందాల చందర్ బాబు, భజరంగ్ దళ్ బాద్యులు శివరాములు, శ్రీరామ్ ఉదయ్‌కుమార్, వెలగందుల రాజు, సాయి, వేణు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.