
పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలి
● వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు
ఎం.యాకాద్రి
హన్మకొండ: పరిశోధన ఫలితాలు రైతులకు చేరాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ ఎం.యాకాద్రి అన్నారు. వరంగల్ జిల్లాలోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, పంటపొలాల్లో నిర్వహిస్తున్న వివిధ పరిశోధనలు, నూతన వంగడాల పరీక్ష క్షేత్రాలు, గీసుకొండ మండలం మచ్చాపూర్‌లో అధిక సాంద్రత విధానంలో సాగు చేస్తున్న పత్తి పంట, నర్సంపేట మండలంలో గురిజాలలో నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేస్తున్న వరి పంటను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డితో కలిసి బుధవారం యాకాద్రి పరిశీలించారు. జిల్లాలో రైతుల కోసం నిర్వహిస్తున్న వివిధ విస్తరణ కార్యక్రమాల పురోగతి గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎ.విజయభాస్కర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.వీరన్న, డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ విశ్వతేజ, ఏఈఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వనదేవతలను దర్శించుకున్న వైస్‌చాన్స్‌లర్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మను బుధవారం ఐదు రాష్ట్రాలకు చెందిన వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు (వీసీ) దర్శించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్, (సిమ్లా) త్రిపుర, పాండిచ్చేరి, కర్ణాటక, (బెంగుళూర్) గుజరాత్ (రాజ్‌కోట్) రాష్ట్రాలకు చెందిన వీసీలు సంజయ్‌శర్మ, మిలాని రాణి, వెంకటరావు, విష్ణకంటి, నవీన్‌చంద్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో వీసీలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైస్ చాన్స్‌లర్లను పూజారులు అమ్మవారి శేషవస్త్రాలతో సన్మానించి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు మధు, బాలకృష్ణ, పూజారులు పాల్గొన్నారు.