
పెరిగిన భూగర్భ జలాలు
● ఇటీవల కురిసిన భారీ వర్షాలు
● తగ్గిన భూగర్భ జల వినియోగం
హన్మకొండ: గ్రేటర్ వరంగల్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జల వినియోగం తగ్గింది. చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. వరంగల్ జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 3.14 మీటర్ల లోతు, హనుమకొండ జిల్లాలో 4.70 మీటర్ల లోతులో ఉన్నాయి. ఈ వర్షాకాలంలో వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లాలో సాధారణ వర్షం కురిసింది. ఈ మేరకు భూగర్భ జలాల పెరుగుదలలో స్వల్ప తేడా ఏర్పడింది. వరంగల్ జిల్లాలో సగటు భూగర్భ జలమట్టంతో పోలిస్తే హనుమకొండ జిల్లాలో 1.6 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పటి వరకు వరంగల్ జిల్లా సగటు సాధారణ వర్షపాతం 698.4 మిల్లీమీటర్లు కాగా.. 868.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్ధన్నపేట, గీసుకొండలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఖిలా వరంగల్, వరంగల్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది. హనుమకొండ జిల్లాలో సగటు సాధారణ వర్షపాతం 657.5 మిల్లీమీటర్లు కాగా.. 660 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హసన్‌పర్తి, హనుమకొండ, కాజీపేట, ఐనవోలు, మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో హనుమకొండ జిల్లాలో భూగర్భ జలాల పెరుగుదల స్వల్పంగానే ఉంది.