జర్నలిజం విభాగంలో వివాదం | - | Sakshi
Sakshi News home page

జర్నలిజం విభాగంలో వివాదం

Jul 24 2025 8:53 AM | Updated on Jul 24 2025 8:53 AM

జర్నలిజం విభాగంలో వివాదం

జర్నలిజం విభాగంలో వివాదం

ఆ విభాగంలో అసలేం జరుగుతోంది?

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో రెమ్యునరేషన్‌ బిల్లుల వివాదం కొనసాగుతోంది. తమకు బిల్లులు ఇవ్వడం లేదని పార్ట్‌టైం అధ్యాపకులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా, గత మే నెలలో వీసీ ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం ఓ కమిటీని నియమించారు. ఆకమిటీ బుధవారం జర్నలిజం విభాగాన్ని సందర్శించి రెండోసారి విచారణ జరిపింది.

2012నుంచి కొనసాగుతున్న ఎస్‌ఎఫ్‌సీ

జర్నలిజం మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సు (ఎస్‌ఎఫ్‌సీ) 2012 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ విభాగాధిపతిగా డాక్టర్‌ సంగని మల్లేశ్వర్‌ కొనసాగుతున్నారు. కేయూ రిజిస్ట్రార్‌ ఉత్తర్వుల మేరకు గత విద్యాసంవత్సరం వరకు ఆరుగురు పార్ట్‌టైం అధ్యాపకులు కొనసాగినట్లు సమాచారం. ఈ విద్యాసంవత్సరానికి ఇంకా పార్ట్‌టైం అధ్యాపకులకు ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిసింది.

కమిటీ పరిశీలించాల్సిన అంశాలు ఇవీ..

జర్నలిజం మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో పార్ట్‌టైం బోధన ఏర్పాట్లు, ప్రథమ, ద్వితీయ సెమిస్టర్ల పాఠ్యాంశాల్లో పునరావృతం, పార్ట్‌టైం అధ్యాపకులకు బోధనా బాధ్యతల కేటాయింపుపై కమిటీ విచారణ జరపాలి.

రెండోసారి విచారణ జరిపిన కమిటీ..

జర్నలిజం విభాగంలో పలు అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ చైర్మన్‌గా జియాలజీ విభాగం ప్రొఫెసర్‌ ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్‌ బి.సురేశ్‌లాల్‌, సోషియాలజీ విభాగం ప్రొఫెసర్‌ కుంట ఐలయ్య సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కొద్దిరోజుల క్రితం ఒకసారి విచారణ జరిపింది. తాజాగా రెండోసారి బుధవారం పార్ట్‌టైం అధ్యాపకులు, విద్యార్థులు, ఇన్‌చార్జ్‌ విభాగాధిపతిగా ఉన్న సంగని మల్లేశ్వర్‌ను విచారణ జరిపారు. సుమారు నాలుగు గంటలపాటు విచారణ సాగింది. విద్యార్ధులు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. పార్ట్‌టైం అధ్యాపకులు మాత్రం తమకు ఐదేళ్లనుంచి ఇప్పటివరకు రెమ్యునరేషన్‌ బిల్లులు ఇవ్వడం లేదని కమిటీ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఎందుకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని మల్లేశ్వర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. పార్ట్‌టైం అధ్యాపకుల నియామకానికి అప్పటి యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంలో జాప్యం చేశారని కమిటీకి తెలియజేసినట్లు సమాచారం. విచారణ ముగిసిందని, కమిటీ నివేదికను కొద్దిరోజుల్లో యూనివర్సిటీ అధికారులకు ఇవ్వనుందని సమాచారం. ఆ నివేదికను బట్టి వర్సిటీ అధికారుల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

రెమ్యునరేషన్‌ బిల్లులు ఇవ్వడం లేదని పార్ట్‌టైం అధ్యాపకుల ఫిర్యాదు

కేయూ వర్సిటీ ప్రిన్సిపాల్‌ లేఖతో కమిటీ నియామకం

రెండు సార్లు విచారణ జరిపిన కమిటీ

కమిటీ నియామకంతో జర్నలిజం విభాగంలో అసలేం జరుగుతుందన్న చర్చ యూనివర్సిటీలో జరుగుతోంది. విద్యార్థులు కొందరు సరిగా క్లాస్‌లకు రాకపోవడం.. పలువురు పార్ట్‌టైం అధ్యాపకులు కూడా తరగతులు తీసుకోకపోవడం వంటివి చోటుచేసుకున్నాయనేది కొద్దిరోజుల క్రితం యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి.మనోహర్‌ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో 2021–2022 విద్యాసంవత్సరానికి సంబంధించిన పార్ట్‌టైం అధ్యాపకుల రెమ్యునరేషన్‌ బిల్లులు ఆడిట్‌లో పాస్‌ అయి యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ వద్దకు కొన్నినెలల క్రితం వచ్చాయి. దీంతో ఆయన ఆ విభాగానికి వెళ్లి అప్పటి పార్ట్‌టైం అధ్యాపకుల అటెండెన్స్‌ రిజిస్టర్‌ను పరిశీలించగా పలువురు అధ్యాపకులు పీరియడ్‌లు తీసుకున్నట్లు పెట్టిన బిల్లులకు అనుగుణంగా అటెండర్‌ రిజిస్టర్‌లో కొన్ని సంతకాలు లేవని గుర్తించారు. కొన్ని పీరియడ్‌లు తీసుకోకున్నా బిల్లులు మాత్రం తీసుకున్నట్లుగా పెట్టినట్లు గుర్తించిన మనోహర్‌ ఆ రెమ్యునరేషన్‌ బిల్లులను చెల్లించకుండా నిలిపివేశారు. పాతబిల్లులు చెల్లించవద్దని కొంతకాలం క్రితం యూనివర్సిటీ అధికారులు మౌఖికంగా తెలియజేసిన దాని ప్రకారం ఈ బిల్లులు చెల్లించాలా.. వద్దా? అనేది వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలు అంశాలకు సంబంఽధించి ఓ లేఖను కూడా అందజేశారు. 2022– 2023, 2023–2024, 2024–2025 పార్ట్‌టైం అధ్యాపకుల బిల్లులు కూడా ఇప్పటివరకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ వద్దకు రాలేదు. కాకతీయ యూనివర్సిటీ పార్ట్‌టైం లెక్చరర్ల అసోసియేషన్‌ (కుప్లా) ఇచ్చిన వినతి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ మనోహర్‌ ఇచ్చిన లేఖతో గత మే నెలలోనే విచారణ కమిటీని నియమించారు. ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement