
సంక్షేమ బాట
● మండల కేంద్రాల్లో సభలు, రేషన్‌కార్డుల పంపిణీతోపాటు పథకాల అమలుపై సమీక్ష
● ఆగస్టు 10 వరకు వరుసగా
కార్యక్రమాలు.. సర్వసన్నద్ధమైన
యంత్రాంగం
● ఆశల పల్లకీలో అందరూ..
‘రేషన్’ జాబితాలో ఎందరో..
● సదస్సుల నిర్వహణ తీరుపై
ఇంటెలిజెన్స్ నిఘా?
సాక్షిప్రతినిధి, వరంగల్:
రాష్ట్ర ప్రభుత్వం నేటినుంచి రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మరో మూడు పథకాల అమలును క్షేత్రస్థాయిలో సమీక్షించనుంది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు శుక్రవారం నుంచి మండలాల వారీగా ఏర్పాటుచేసే సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 21న మంత్రులతో కలిసి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు కలెక్టర్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వంనుంచి కార్యక్రమాల షెడ్యూల్ కూడా అందింది. ఉమ్మడి వరంగల్‌లో శుక్రవారం నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కలెక్టర్‌లు కార్యాచరణ సిద్ధం చేశారు.
‘రేషన్’ పంపిణీకి ప్రాధాన్యం
మండల కేంద్రాల్లో జరిగే సదస్సుల్లో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టనుండగా.. ఇందిరమ్మ ఇళ్ల, సీజనల్ వ్యాధులు, ఎరువుల సరఫరా, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్‌లు పాల్గొనాల్సి ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒకచోట ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పాల్గొనేలా కలెక్టర్‌లు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి సమాచారం అందించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్డీఓ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. రేషన్‌కార్డుల పంపిణీ మొదటి ప్రాధాన్యం కాగా, ఉమ్మడి వరంగల్‌లో ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో 12.13 లక్షల రేషన్‌కార్డులుండగా.. జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన సదస్సుల్లో 1,57,820 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 7.31 లక్షల మందికి కార్డులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించగా... ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన దరఖాస్తులపై కసరత్తు చేసిన అధికారులు ఎందరిని అర్హులుగా తేల్చారో? అన్న సందేహాలకు నేటినుంచి తెరపడనుంది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తొమ్మిది లక్షల మేరకు దరఖాస్తులు రాగా, వాటిని వడబోసిన అధికారులు.. ఆరున్నర లక్షల వరకు కుదించినట్లు ప్రకటించారు. మొదటి విడతగా నియోజవకర్గానికి 3,500ల చొప్పున 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 42 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 50శాతం మంది ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టలేదన్న ప్రచారం ఉంది. ఈ మేరకు ఈ నిర్మాణాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు అధికారుల సమాచారం.
సదస్సులపై ఇంటెలిజెన్స్ నిఘా?
రేషన్‌కార్డుల పంపిణీ, మండలస్థాయి సదస్సుల తీరుపై నివేదికలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. జూలై 25 నుంచి ఆగస్టు 10 ఉమ్మడి వరంగల్‌లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న కార్యక్రమాలపై సమగ్ర నివేదిక రోజు వారీగా అందించాలని సూచించినట్లు తెలిసింది. మొదటి రోజు ఏయే నియోజకవర్గాల్లో ఏ మండలాల్లో నిర్వహించారు? ఆ కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొన్నారు? ఇన్‌చార్జ్ మంత్రి ఎక్కడెక్కడ పాల్గొన్నారు? ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హాజరవుతున్నారా? చాలా ఏళ్ల తర్వాత రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న సందర్భంగా అర్హులైన వారి స్పందన ఎలా ఉంది? తదితర అంశాలపై నివేదిక కోరినట్లు సమాచారం.
నేటినుంచి ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు, అధికారులు