
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద.. తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూ భారతి దరఖాస్తులు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై గురువారం తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి, అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని సూచించారు. సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను విభజిస్తూ సత్వరమే వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి అన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. అవసరమైన రికార్డులు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం..
జాతీయ ఐక్యత, సమగ్రత, స్ఫూర్తిదాయక సహకారం, సేవలు అందించిన ప్రముఖ వ్యక్తులు, సంస్థల నుంచి సర్దార్‌పటేల్ జాతీయ సమైక్యతా అవార్డుకు కేంద్ర హోంశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రతిని డౌన్‌లోడ్ చేసుకుని కలెక్టరేట్ ‘సీ’ సెక్షన్‌లో అందజేయాలని పేర్కొన్నారు.
ఆరోగ్య జిల్లాగా మార్చాలి..
ప్రజలకు మెరుగైన సేవలందించి ఆరోగ్య జిల్లాగా వరంగల్‌ను మార్చాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రతి శనివారం వైద్యాధికారులు పాఠశాలలను సందర్శించి పిల్లలకు స్ఫూర్తి కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందించాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన వైద్య, ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్‌ఓ సాంబశివరావు పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వైద్యులు ప్రకాశ్, కొంరయ్య, రవీందర్, ఆచార్య, అర్చన, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.