
‘గ్రేటర్’ అప్రమత్తం
వరంగల్ అర్బన్ : భారీ వర్షాల సూచన మేరకు గ్రేటర్ వరంగల్ పరిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం రోజంతా మోస్తరు వర్షం కురిసింది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారంతో బుధవారం వరంగల్ బల్దియా కౌన్సిల్ హాల్‌లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్.. వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశంఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారయంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్ధేశం చేశారు. వరద నీరు, పారిశుద్ధ్యం, అనారోగ్య సమస్యల నివారణ, వర్షపాత సమాచారంపై ప్రజలను జాగృతం చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో డీ వాటరింగ్ చేయాలి..
నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు డీ వాటరింగ్ చేయాలని, బల్దియా పరిధి ఆయా నియోజకవర్గాల ప్రాంతాల్లో శాసన సభ్యులు సూచించిన మేరకు మాన్‌సూన్ ముందస్తు ఏర్పాట్లు చేయాలని మేయర్ పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి బెడ్ షీట్లు ఆహారం అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
శిథిల భవన నివాసితులను ఖాళీ చేయించాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ నగరంలోని శిథిల భవనాలకు నోటీసుకు ఇచ్చారా? అని సిటీప్లానర్‌ను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు కూలిపోయే అవకాశం ఉన్న ఆవాసాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలన్నారు. ఒకవేళ అనుకోని ఘటనలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రంగ సముద్రాన్ని మేయర్, కమిషనర్ పరిశీలించి వినాయక నిమజ్జనానికి 15 రోజుల ముందే మొత్తం పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈలు రవికుమార్ , శ్రీనివాస్, సంతోశ్‌బాబు, మాధవీలత, డీఈలు, శానిటరీ సూపర్‌వైజర్లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
వీఎండీలపై వర్షపాత సంబంధ సమాచారం..
నగరవాసులకు వర్షపాత సమాచారం ఎప్పటికప్పుడు తెలిసేలా వీఎండీ (వేరియబుల్ మెసేజ్ డిస్‌ప్లే బోర్డు)లపై ప్రదర్శించాలని నిర్ణయించారు. హనుమకొండ బస్‌స్టేషన్ సర్కిల్, బల్దియా ప్రధాన కార్యాలయం, పబ్లిక్ గార్డెన్, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో వేరియబుల్ మెసేజ్ డిస్‌ప్లే బోర్డులున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సమాచారాన్ని ఆయా ప్రదేశాల్లోని బోర్డులపై ప్రదర్శిస్తూ ప్రజలను అప్రమత్తం చేయనున్నారు. అదేవిధంగా వరదలు, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1980, 97019 99645, 97019 99676 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చు.
నగరంలో రోజంతా మోస్తరు వర్షం..
అధికారులతో సమీక్షించిన
మేయర్, కమిషనర్
వర్షపాత సమాచారం
వీఎండీలపై ప్రదర్శించాలి..
సమన్వయంతో యుద్ధప్రాతిపదికన చర్యలు ఉండాలి
మేయర్, కమిషనర్ గుండు సుధారాణి, చాహత్ బాజ్‌పాయ్ దిశానిర్దేశం
మోస్తరు నుంచి భారీ వర్షం
హన్మకొండ: వరంగల్, హనుమకొండ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రుతుపవన ద్రోణి, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా.. రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈక్రమంలో రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడా వర్షం కురిసింది. హనుమకొండ జిల్లాలో సగటున 40.4 మిల్లీమీటర్ల వర్షపాతం, వరంగల్ జిల్లాలో సగటున 42.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

‘గ్రేటర్’ అప్రమత్తం