
కలెక్టర్ విస్తృత తనిఖీలు
హసన్‌పర్తి: హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం హసన్‌పర్తి మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హసన్‌పర్తిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 300 మంది విద్యార్థినులు ఒకేసారి భోజనం కోసం క్యూలో నిలబడడంపై స్పెషల్ ఆఫీసర్ స్వప్నను ప్రశ్నించారు. కూరగాయలతో పాటు స్పోర్ట్స్ మెటీరియల్ స్టాక్ రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈఓ వాసంతికి సూచించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె వెంట డీఈఓ వాసంతి, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ ఫాజిల్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ కార్యాలయంలో భూ–భారతి దరఖాస్తుల పరిశీలనను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలు తెలుసుకున్నారు. భూ–భారతిలో చేపడుతున్న రిజిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రహీం, ఆర్‌ఐలు ఫాజిల్, రాజేంద్రపసాద్, సీనియర్ అసిస్టెంట్ కుమార్ పాల్గొన్నారు.
సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సీజన్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. హసన్‌పర్తిలోని ఆస్పత్రిని తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఫార్మసీ విభాగంలో మందుల నిల్వలు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్ పనిచేయక మూడేళ్లవుతోందని, మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని స్థానికుడు వీసం సురేందర్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. హసన్‌పర్తిలో నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ సెంటర్‌ను నగరానికి తరలించారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా, రెండేళ్ల పాటు ఇక్కడ పనిచేసినప్పటికీ వేతనాలు ఇవ్వలేదని ఓ మహిళ.. కలెక్టర్ ఎదుట వాపోయింది. గతంలో ఆస్పత్రి డెవలప్‌మెంట్ ఫండ్ కింది వేతనాలు అందించామని, ఇప్పుడు ఆనిధులు నిలిపేసినట్లు డీఎంహెచ్‌ఓ అప్పయ్య తెలిపారు. అలాంటప్పుడు ఆమెతో ఎందుకు పనిచేయించుకున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. కార్యక్రమంలో వైద్యాధికారి భార్గవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కేజీవీబీలో స్పెషల్ ఆఫీసర్‌కు
షోకాజ్ నోటీస్
భూ–భారతి దరఖాస్తుల పరిశీలన
వేగవంతానికి ఆదేశం