
‘మహాలక్ష్మి’తో మహిళా సాధికారత
వరంగల్ చౌరస్తా: మహాలక్ష్మి పథకంతో మహిళా సాధికారత సిద్ధిస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో బుధవారం మహాలక్ష్మి పథకం సంబురాలు నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి కేక్ కట్ చేశారు. వ్యాసరచన, రంగోళి పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలు స్టాళ్లను పరిశీలించి, ఐదు అద్దె బస్సుల తాళాలను మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంతో ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళలకు అసలైన గౌరవం దక్కుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 15.43 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.690 కోట్లు ఆదా చేసుకున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖకు రూ.170 కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ చింతాకుల అనిల్, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం భానుకిరణ్, డిపో మేనేజర్, ధరంసింగ్, తహసీల్దార్ ఇక్బాల్, మెప్మా డీఎంసీ రేణుక, టీఎంసీ రమేశ్ పాల్గొన్నారు.
ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లడం లేదు..
ఆరోగ్యం దెబ్బతింటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్ఎంపీలను సంప్రదిస్తే వారు రూ.200, రూ.300 ఫీజు తీసుకుంటున్నారని మంత్రి మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లకుండా ఉచిత బస్సు ప్రయాణంతో వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్ద ఆపరేషన్లు చేయించుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నారని పేర్కొన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యం..
సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ 12వ డివిజన్ దేశాయిపేట ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ కావేటి కవితతో కలిసి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లను మంత్రి అందజేశారు. కమ్యూనిటీ హాళ్లకు బదులు మ్యారేజ్ హాళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఏసీపీ శుభం, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, కార్పొరేటర్ కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో
సంబురాలు