
ఒక్క ఏఆర్‌కు ఐదు బాధ్యతలు!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ల (ఏఆర్) కొరత వేధిస్తోంది. ఒక్కరికే ఐదు కీలక విభాగాల బాధ్యతలు అప్పగించడం, మరో ముగ్గురిని ఒక విభాగంలోనే పనిచేయించడంలో అధికారుల ఆంతర్యమేమిటో అంతుపట్టడం లేదన్న చర్చ నడుస్తోంది. యూనివర్సిటీలో 15 అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఒక పోస్టు ఖాళీగా ఉండగా, మరో ఇద్దరు కొంతకాలం క్రితమే సస్పెన్షన్‌కు గురయ్యారు. మరొకరు ఈ ఏడాది జూలైలో ఉద్యోగ విరమణ పొందనున్నట్లు సమాచారం. యూనివర్సిటీలో ప్రస్తుతం 12మంది ఏఆర్‌లు పనిచేస్తున్నారు. అందులో ఎక్కువమంది ఒక్కొక్కరికి రెండు, మూడు చోట్ల బాధ్యతలు అప్పగించడంతో పనిభారం పడుతోందని అంటున్నారు. యూనివర్సిటీ కాలేజీలు, వివిధ విభాగాలు పెరిగినా ఏఆర్‌ల పోస్టులు మాత్రం పెరగడం లేదు. అర్హులైన సూపరింటెండెంట్లకు ఏఆర్‌గా పదోన్నతులు కల్పించడంలేదు. మరోవైపు యూనివర్సిటీలో నాలుగు డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. అర్హులైన ఏఆర్‌లకు డిప్యూటీ రిజిస్ట్రార్‌లుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
సెలవుపై ఏఆర్..
మరొకరికి ఐదుచోట్ల బాధ్యతలు
కాకతీయ యూనివర్సిటీలో కీలక విభాగాల్లో పబ్లికేషన్ సెల్ డైరెక్టర్‌గా, పరీక్షల విభాగం, సర్టిఫికెట్ సెక్షన్‌లో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, ఎస్‌డీఎల్‌సీఈలో ఏఆర్‌గా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న డాక్టర్ నర్సింహారావు ఇటీవల నెలరోజులపాటు సెలవుపై అమెరికాకు వెళ్లారు. ఆయన నిర్వహిస్తున్న ఆ మూడు బాధ్యతలను ఏఆర్ హబీబుద్దీన్‌కు అదనంగా అప్పగించారు. ఇప్పటికే హబీబుద్దీన్ క్యాంపస్‌లో అకడమిక్ డీన్ ఆఫీస్‌లో, యూజీసీ విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నర్సింహారావు నిర్వర్తించిన మూడు కీలక బాధ్యతలను హబీబుద్దీన్‌కు అప్పగించడంతో ఐదుచోట్ల పనిచేయడం ఇబ్బందికరంగా మారింది. ఆ ఐదు విభాగాలు కూడా కీలకమైనవే కావడం, ఒకరోజు సెలవు పెడితే ఐదు చోట్ల ఇబ్బంది ఏర్పడే పరిస్థితులున్నాయి. ఒక్క చోటనే బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఏఆర్‌లు కూడా ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి మరోచోట అదనంగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతోంది. కీలక పదవులు ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగించడంలో యూనివర్సిటీ అధికారుల ఆంతర్యమేమిటి అనేది కూడా చర్చగా ఉంది. పరీక్షల విభాగంలో సర్టిఫికెట్ సెక్షన్ కూడా కీలకమైంది. అక్కడ ఎప్పటికి ఒక ఏఆర్ అయినా బాధ్యతలను నిర్వర్తించాల్సింటుంది. ఒకప్పుడు ఆ విభాగంలో డిప్యూటీ రిజిస్ట్రార్ విధులను నిర్వర్తించారు. ఆయన కొంతకాలం క్రితమే ఉద్యోగ విరమణ పొందారు. ఆయనస్థానంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ సెక్షన్‌పై పర్యవేక్షణ కొరవడే అవకాశాలున్నాయి.
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి,
హాస్టళ్ల ఆఫీస్‌కు ఏఆర్‌లు లేరు..
హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న ఏఆర్ కొన్నినెలల క్రితమే సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా ఎవరినైనా నియమించాల్సింటుంది. ఏఆర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆ కాలేజీ ప్రిన్సిపాల్, నాన్‌టీచింగ్ అసోసియేషన్ బాధ్యులు ఇటీవల వీసీ, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో ఏఆర్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షల్లో బిల్లులు పెడుతుంటారు, లావాదేవీలుంటాయి. పరిశీలన, పర్యవేక్షణ కూడా అవసరం ఉంటుంది. అక్కడ హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో పనిచేసిన ఏఆర్ ఏసీబీకి పట్టుబడి సస్పెన్షన్ అయి 17 నెలలు కావొస్తుంది. అప్పటినుంచి ఆ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. కేయూ వీసీగా ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడు నెలలు అవుతుంది. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, కనీస మార్పు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కాకతీయ యూనివర్సిటీలో
అసిస్టెంట్ రిజిస్ట్రార్ల కొరత
పనిభారంతో ఏ విభాగాన్ని
సరిగా చూసుకోలేని పరిస్థితి..
ముగ్గురికి ఒక్కచోటే బాధ్యతలు, మరికొందరికి రెండు, మూడు
అమెరికాకు వెళ్లిన మరో ఏఆర్,
ఇంకో ఇద్దరు సస్పెన్షన్‌లో..