
చిరువ్యాపారులపై అధికారుల జులుం
కూరగాయల దుకాణాల తొలగింపు
హన్మకొండ చౌరస్తా: చిరువ్యాపారులపై బల్దియా అధికారులకు కోపం వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్నారంటూ నేలపై పడేశారు. దండం పెడతాం వదిలేయండని వేడుకున్నా కనికరించలేదు. దీంతో పలువురు చిరువ్యాపారులు కన్నీరు మున్నీరయ్యారు. హనుమకొండ చౌరస్తాలోని ఖాళీ స్థలంలో గత నాలుగేళ్లుగా దాదాపు 40కి పైగా చిరువ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం చౌరస్తా కూరగాయల అడ్డా వద్దకు వచ్చిన మున్సిపల్ అధికారులు ‘మీకు ఖాళీ చేయాలని రెండు రోజుల ముందే చెప్పాం. అయినప్పటికీ మీరు చేయడం లేదు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలను చిందరవందర చేశారు. వద్దు సారూ గిరిగిరి తెచ్చి కూరగాయలు కొనుక్కొచ్చా అంటూ వేడుకున్నా వదిలి పెట్టలేదు. రేపటినుంచి ఇక్కడ ఎవరూ ఉండొద్దంటూ హుకుం జారీ చేసి వెళ్లారని మహిళ చిరువ్యాపారులు కన్నీరు పెడుతూ చెప్పారు.