
సర్వే నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్లు
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య
హసన్‌పర్తి : రాబోయే రోజుల్లో సర్వే నివేదిక ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం ఉందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్‌లో 50రోజుల పాటు నిర్వహిస్తున్న సర్వేయర్ల శిక్షణ శిబిరాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. సర్వేకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణార్థులకు అవసరమైన మెటీరియల్‌ను అందజేశారు. అనంతరం ప్రావీణ్య మాట్లాడుతూ.. శిక్షణలో సర్వేయర్లు అన్ని అంశాలపై పట్టు సాధించాలన్నారు. చివరగా పరీక్షలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికే భూభారతి సర్వేయర్లుగా అవకాశం లభిస్తుందన్నారు. భూవివాదాల పరిష్కారానికి సర్వే నివేదికలే కీలకమన్నారు. కాగా, కలెక్టర్ స్వయంగా శిక్షణార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ చల్లా ప్రసాద్‌స, లైసెన్స్ సర్వేయర్ల జిల్లా అధ్యక్షుడు పెసరు బొందయ్య, చుంచు రవి, తదితరులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ
అదేవిధంగా మండలంలోని లక్ష్మీ ఫర్టిలైజర్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లులను పరిశీలించారు. గోదాంలోని నిల్వలను స్వయంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్, మండల వ్యవసాయాధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి
హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో భూసేకరణ ప్రక్రియపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భూసేకరణ మొదటి దశలో గుర్తించిన రైతులకు జూన్ 30 నాటికి పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ డీఈ చైతన్య, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేష్ బాబు, ఆర్డీఓలు రాథోడ్ రమేష్, కె.నారాయణ, నేషనల్ హైవే అధికారులు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.