
దేశపౌరులను చంపిన వారితో చర్చలా?
హసన్‌పర్తి : దేశపౌరులను చంపిన ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధపడిన కేంద్ర ప్రభుత్వం..పేదల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలు జరపడానికి ఎందుకు ముందుకు రావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. హసన్‌పర్తిలో జరుగుతున్న ఆ పార్టీ హనుమకొండ జిల్లా మహాసభల్లో భాగంగా మంగళవారం ఏర్పాటుచేసిన సీపీఐ ప్రతినిధుల సభలో సాంబశివరావు మాట్లాడారు. ఉగ్రవాదుల కంటే కమ్యూనిస్టులు అంటేనే మోదీకి భయమన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్ వల్లే శవాలను ఇవ్వడానికి భయపడ్డారని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీతో జతకట్టడానికి బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని, కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ ద్వారా అది స్పష్టమైందన్నారు. ఆపరేషన్ కగార్‌పై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చేసి మనువాదాన్ని తీసుకువచ్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నివేదికను సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ప్రవేశపెట్టగా, వాటిని ఆమోదించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, కార్యక్రమ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రాజమౌళి, ప్రధాన కార్యదర్శి జ్యోతి, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, సారంగపాణి, శంకర్, షేక్ బాబా, సిరబోయిన కర్ణాకర్, శ్యాం సుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,
కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు