
ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు
పాలకుర్తి: ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిందనే కారణంతో పాలకుర్తి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2017లో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీరెడ్డి, డాక్టర్ రాజేందర్‌రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అమెరికా పౌరసత్వం కలిగిన ఝాన్సీరెడ్డి స్వదేశంలో భూమి ఎలా కొనుగోలు చేస్తుందంటూ వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన దామోదర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 1న హైకోర్టులో జడ్జి సీవీ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై జూన్ 19 లోపు వివరణ ఇవ్వాలని ఝాన్సీరెడ్డి, డాక్టర్ రాజేందర్‌రెడ్డి దంపతులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు రెవెన్యూ అధికారుల వివరణ కోరింది. గుర్తూరులో కొనుగోలు చేసిన 75 ఎకరాల భూమిలో ఝాన్సీరెడ్డి దంపతులు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసి పనులకు శ్రీకారం చుడుతున్న తరుణంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చానీయాంశంగా మారింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి.. ఝాన్సీరెడ్డికి కోడలు కావడం గమనార్హం.