
వివాదాలకు అడ్డాగా ‘మిల్స్ కాలనీ’
సాక్షి, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే పోలీసు అధికారులు భూ వివాదాల్లో తలదూరుస్తూ సస్పెండ్ వరకు వెళ్తున్న ఉదంతాలు వరుసగా జరుగుతుండడం గమనార్హం. ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఠాణా పరిధిలో ఎక్కువగా భూసమస్యలే వస్తుండడంతో వాటిపై కన్నేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కొందరు ఇన్‌స్పెక్టర్లు భూవివాదాల్లో పరిధి దాటి వ్యవహరించడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. తాజాగా సీఐ వెంకటరత్నంపై పలు వివాదాలు రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ సీసీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
గతంలోనూ...
● దూపకుంటలోని 20 గుంటల భూమిలో ఏడుగురు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి సోదరుడు తనదంటూ రావడంతో బాధితులకు సహాయం చేయాల్సిన సీఐ రవి కిరణ్ వారిని పట్టించుకోకపోవడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మరో సీఐపై భూవివాదంలో తలదూర్చారనే ఆరోపణలొచ్చాయి. అలాగే ఆయన పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ నిందితుడు భవనంపైనుంచి కిందపడడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సదరు అధికారిని ఇక్కడినుంచి మరో చోటికి బదిలీ చేశారు.
● తర్వాత వచ్చిన సీఐ మల్లయ్యపై కూడా ఉన్నతాధికారులకు భూవివాదాల్లో తలదూర్చారనే ఫిర్యాదులు వెళ్లాయి. అదేసమయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ స్టేషన్ ఘన్‌పూర్ లోని ఓ గుడికి వెళ్లిన సమయంలో పరిధి దాటి ఎస్కార్ట్‌గా వెళ్లడంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు.
తాజాగా సీఐ వెంకటరత్నంపై
వేటుతో చర్చ
గతంలోనూ భూవివాదాల్లో
కొందరు అధికారులు
సస్పెండ్, అటాచ్డ్‌లతో
ఉన్నతాధికారుల చర్యలు