
ఇద్దరు పిల్లలు ఆర్మీలోకి..
స్టేషన్‌ఘన్‌పూర్: ఇప్పగూడెం గ్రామానికి చెందిన జిట్టెబోయిన రాజు, శ్రీకాంత్ భారత ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. సుభద్ర, వెంకటయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించి వివాహం చేశారు. కాగా పిల్లలకు తల్లి చిన్నప్పటి నుంచే దేశభక్తిని నూరిపోసింది. దేశ రక్షణకు మించిన సేవ లేదని చెప్పిన మాతృమూర్తి కోరిక మేరకు కొడుకులిద్దరూ డిగ్రీ వరకు చదివి పదేళ్ల క్రితం భారత ఆర్మీకి ఎంపికయ్యారు. ప్రస్తుతం వారు ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. ‘మా పిల్లలు రాజు, శ్రీకాంత్ చిన్నవయస్సు నుంచే భారత సైన్యం అంటే ఇష్టపడేవారు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో యుద్ధం ఆందోళనగా ఉంది. మా పిల్లలతోపాటు భారత ఆర్మీలో ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని ఆదేవుడిని ప్రార్థిస్తున్నాం.’ అని తల్లి సుభద్ర తెలిపింది.
ఆర్మీలో ఉద్యోగం నా కల
మహబూబాబాద్ అర్బన్: నా చిన్నతనం నుంచే పోలీస్,ఆ ర్మీలో చేరాలన్నది నాకల. 2012లో ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యా. ఆడపిల్లవు, ఆర్మీ అంటే ప్రాణాలతో చెలగాటం.. అని అమ్మ భయపడింది. కానీ, ఈరోజుల్లో ఆడపిల్లలు విమానాలు, రాకెట్లు నడపుతున్నారు.. దేశాలు దాటి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.. నేను దేశంలోనే ఉంటూ దేశంకోసం పనిచేస్తానని అమ్మకు నచ్చజెప్పా. గుజరాత్, జమ్మూకశ్మీర్, న్యూఢిల్లీలో పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాపిడ్‌యాక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నా.
– ఎడ్ల ఝాన్సీ, మానుకోట

ఇద్దరు పిల్లలు ఆర్మీలోకి..