
సుందరీమణుల రాకకు సుందరంగా..
ఖిలా వరంగల్: ప్రపంచ సుందరీమణుల రాకకు కోట సుందరంగా ముస్తాబవుతోంది. శుక్రవారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో శిల్పకళా సంపద మరింత అందంగా, ఆకర్షణీయంగా కనివిందు చేస్తోంది. ఈ సందర్భంగా కాకతీయుల రాజధాని మధ్యకోటలో జరుగుతున్న పనులను కుడా, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శుక్రవారం పరిశీలించారు. శిల్పాల ప్రాంగణం, కోట రోడ్డుకు ఇరువైపులా మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. విద్యుత్‌కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ తగిన ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాల వెలుగుల్లో శిల్పకళా వైభవాన్ని సుందరీమణుల వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రాత్రి శిల్పాల ప్రాంగణంలో ట్రయల్ రన్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు అజిత్‌రావు, భీమ్‌రావు, బల్దియా అధికారులు, కేంద్ర పురావస్తు శాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్‌చార్జ్ అజయ్, గైడ్ దేనబోయిన రవియాదవ్, డీఈ మల్లికార్జున్, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.