
మానసిక వికాసానికి క్రీడలు దోహదం
● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి
● వేసవి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్: మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని, బాల్యం నుంచే ఏదో ఒక క్రీడను ఎంచుకుని అందులో రాణించాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో నెలరోజుల పాటు నిర్వహించనున్న ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని కేఎంసీ మైదానంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులను వృథా చేయకుండా ప్రత్యేక శిక్షణ శిబిరాల ద్వారా సరికొత్త మెళకువలు నేర్చుకోవాలని క్రీడాకారులకు చెప్పారు. వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా కేఎంసీ మైదానం.. ఎంతో మంది జాతీయస్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో డబ్ల్యూసీఏ ఉపాధ్యక్షులు సదాశివ, రాము, కార్యవర్గ సభ్యుడు అభినవ్ వినయ్, కోచ్ గోవింద్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.