
నేటితో ముగియనున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు
హన్మకొండ కల్చరల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న భద్రకాళి, భద్రేశ్వరస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ శేషుభారతి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు నేతృత్వంలో శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా శతుష్టార్చన పూజలు నిర్వహించిన అనంతరం భద్రకాళి అమ్మవారికి ఉదయం శరభ వాహన సేవ, సాయంత్రం పుష్పరథ సేవ జరిపించారు. ఈ పూజాది కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ప్రతినిధులు.. ఉభయ దాతలుగా వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్, బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణగౌడ్, రాష్ట్ర నాయకులు జనగాం శ్రీనివాస్‌గౌడ్, బత్తిని సుదర్శన్ గౌడ్, కుమారస్వామి, కార్పొరేటర్ పోశాల పద్మ తదితరులు పాల్గొన్నారు.