
నాలాల పూడికతీత వేగవంతం చేయాలి
వరంగల్ అర్బన్ : నాలాల పూడికతీతలో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ నగరం ముంపు నివారణలో భాగంగా భద్రకాళి, బొందివాగు, నయీంనగర్, దర్గా కాజీపేట, శాకరాశికుంట, చిన్నవడ్డేపల్లి, శివనగర్, వరంగల్ 12 మోరీలు, అలంకార్ బ్రిడ్జి, నంది హిల్స్, జూ పార్క్ తదితర ప్రాంతాల్లో చేపట్టిన నాలాల పూడికతీత పనులను శుక్రవారం మేయర్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. పలు చోట్ల బాక్స్ డ్రెయిన్లు, నాలలతో పాటు అంతర్గత నాలాల పూడికతీత సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఆయా పనులు పూర్తిస్థాయిలో జరగాలని సూచించారు. తనిఖీల్లో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఏఈలు ముజమ్మిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
‘అమృత్ 2.0’కు నగరానికి రూ.3కోట్లు
కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా చేపడుతున్న జల్ హీ అమృత్ కార్యక్రమ లక్ష్యాలను అమలు చేసేందుకు వరంగల్ నగరానికి రూ.3కోట్లు కేటాయించిందని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆస్కితో కలిసి నగరంలో చేపట్టనున్న అంశాలపై శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో స్మార్ట్ సిటీ, ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో మేయర్ మాట్లాడారు. కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో జల్ హీ అమృత్ కార్యక్రమం స్టార్ రేటింగ్ కోసం హాజరైనట్లు పేర్కొన్నారు. అమృత్ నగరాలకు కేటాయించిన ర్యాంకింగ్‌లో భాగంగా జీడబ్ల్యూఎంసీకి ప్రభుత్వం రూ.3 కోట్ల్లు కేటాయించి, అందులో రూ.2.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. నగరంలోని 5, 15 ఎంఎల్‌డీ ఎస్టీపీలలో ఆన్‌లైన్ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ (ఓసీఈఎంఎస్) ఏర్పాటుకు, ఎస్‌టీపీ భవనాల మీద సోలార్ ఎనర్జీ తయారీకి ప్యానెళ్లు ఏర్పాటు చేసి ప్రతీరోజు 70 కిలోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి, 15 ఎంఎల్‌డీ ప్లాంట్‌లో మురికి నీటిని శుద్ధీకరణకు వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఈ నీటిని పరిశ్రమలకు పంపడానికి (రీ యూజ్) మొత్తంగా రూ.3 కోట్లకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ శ్రీనివాస్, స్మార్ట్ సిటీ పీఎంసీ ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.
మేయర్ గుండు సుధారాణి