
విద్యార్థుల నమోదు పెంచాలి
హనుమకొండ డీఈఓ వాసంతి
విద్యారణ్యపురి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుదలకు కృషిచేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. గురువారం జిల్లాలోని వివిధ ఉపాధ్యాయసంఘాల బాధ్యులతో తన కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవి సెలవుల్లో కూడా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. అక్కడక్కడా కొందరు టీచర్లు ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు తిరుగుతున్నారన్నారు. బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రయత్నించేలా ఉపాధ్యాయుల సంఘాలుగా సహకారం అందించాలన్నారు. జిల్లాలోని 41 పాఠశాలల్లో విద్యార్థులు అసలే లేరన్నారు. వీటిలో విద్యార్థులను చేర్పించుకునేలా కృషిచేయాలన్నారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో ఐదు, ఏడో తరగతి పూర్తిచేసిన విద్యార్థులను సమీప ఉన్నతపాఠశాలల్లో చేర్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గల పిల్లలను సమీప ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డి నేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ మహేశ్, జెండర్ ఈక్విటీ కో–ఆర్డినేటర్ సునీత, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.