మామిడి ప్యాకింగ్ కేంద్రాల తనిఖీ
వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మామిడి డీలర్ల దుకాణాలతో పాటు ప్యాకింగ్ కేంద్రాలను మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్, డీఎంఓ సురేఖలు సోమవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు మామిడి ప్యాకింగ్ చేస్తున్న విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ..రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు తనిఖీ చేసి మామిడి ప్యాకర్లు, ఆహార భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. వరంగల్‌లోని హరీష్ ఫ్రూట్ కో, ఎన్‌ఎస్.ఫ్రూట్ కో, అమ్జద్ ఫ్రూట్ కో, ఎస్‌కె ఫ్రూట్ కో, ఎస్‌ఎఫ్‌ఎ. ఫ్రూట్ కోలను సందర్శించి మామిడి కాయలు పండుగా మారేందుకు కార్బైడ్, ఇతర రసాయనాలు వాడుతున్నారన్న విషయాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. మామిడి కాయలు పండేందుకు ఎగుమతి, బరువు, దూరం ప్రకారం ఒకటినుంచి నాలుగు సాచెట్లు ప్రభుత్వ ఆమోదిత ఇథిలిన్ రైపనర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం నమూనా సాచెట్లను సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌లోని లేబరేటరీలకు పంపిస్తున్నట్లు జేడీఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి శ్రీరామోజు రాము, సిబ్బంది పాల్గొన్నారు.
పీపీటీ ప్రవేశ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: పీపుల్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశానికి సోమవారం హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్‌కుమార్ ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్‌లోని ప్రగతి విద్యానికేతన్‌లో ఉచిత విద్యను అందిస్తారన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పీపుల్స్ ట్రస్ట్ ప్రతినిధి పవన్‌కుమార్, టీఎస్‌యూటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్.రవీందర్‌రాజు, తాటికాయల కుమార్, పెండెం రాజు, సుజన్‌ప్రసాద్‌రావు, జిల్లా కార్యదర్శి సీఎస్‌ఆర్ మల్లిక్ పాల్గొన్నారు.
మామిడి ప్యాకింగ్ కేంద్రాల తనిఖీ


