
కమలాపూర్ సీహెచ్‌సీలో విచారణ
కమలాపూర్ : గర్భిణికి ఆపరేషన్ చేసి ప్రసవ అనంతరం గేజ్ ప్యాడ్ తొలగించకుండా మరిచిన ఘటనకు సంబంధించి కమలాపూర్ సీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ గౌతం చౌహాన్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాలింత తిరుమలతో పాటు ఆమె బంధువులు, సీహెచ్‌సీ వైద్యురాలిని విచారించి వివరాలు సేకరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సీహెచ్‌సీలో విచారణ చేపట్టి వివరాలు సేకరించామని తెలిపారు. 3.5 కిలోల బేబీ డెలివరీ కోసం చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చిందని, సున్నితమైన ప్రదేశం కావడంతో నరాలు చిట్లి బ్లీడింగ్ అయి కొంత ఇబ్బంది ఏర్పడిందని, ప్రస్తుతం తిరుమల ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నారు. పూర్తిగా కోలుకోవడం కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించాలని చూశామని, కానీ అందుకు తిరుమల బంధువులు అంగీకరించలేదని, దీంతో వారికి నచ్చిన ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పినట్లు వివరించారు. ఇక్కడ వైద్య పరంగా ఎలాంటి ఇబ్బంది జరగలేదని, ప్రొటోకాల్ ప్రకారమే డెలివరీ చేశామని వైద్యులు చెబుతున్నారని, విచారణలో భాగంగా ముందస్తుగా వారికి మెమోలు జారీ చేసి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. విచారణ సందర్భంగా స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు పలువురు గ్రామస్తులు విచారణాధికారులకు సీహెచ్‌సీ, పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బందిపై పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. పీఓ ఎంసీహెచ్ డాక్టర్ మంజుల, ఎంపీ హెచ్‌ఈఓ రాజేశ్వర్‌రెడ్డి, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ నరేష్, రమ్య పాల్గొన్నారు.
బాలింత, ఆమె బంధువులు,
వైద్యుల నుంచి వివరాల సేకరణ