
మార్కెట్‌కు మోక్షమెప్పుడో..?
కాజీపేట: కాజీపేట పట్టణంలో చేపల మార్కెట్ నిర్మాణానికి స్థల గ్రహణం వీడడం లేదు. దీంతో వినియోగదారులు, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం బాపూజీనగర్ ప్రధాన రహదారిపైనే కొన్నేళ్లుగా చేపల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రధాన రహదారిపై పరదాలు కట్టుకుని వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు. చేపల వ్యాపారులను మార్కెట్‌లోకి తరలించాలనే ప్రతిపాదనలు ఉన్నా.. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కడిపికొండ శివారులోని ప్రభుత్వ భూమిలో ఇటీవల రూ.60 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన రేకుల షెడ్డులు నిరుపయోగంగా మారాయి. వీటిలోకి చేపల మార్కెట్‌ను తరలించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో రోడ్డునే నమ్ముకుని చేపలు అమ్మకుంటూ మహిళలు ఇబ్బందులు పడ్తున్నారు.
రోడ్డు వెడల్పుతో ఉపాధి కరువు...
ఇటీవల నగర విస్తరణలో భాగంగా అధికారులు చేపట్టిన కూల్చివేతలతో చేపల విక్రయదారులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టడంతో ఉపాధిని కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా చేపల మార్కెట్‌కు అనువైన స్థలాన్ని కేటాయించాలని వ్యాపారులు, వినియోగదారులు కోరుతున్నారు.
సమస్య పరిష్కరించాలి..
కాజీపేట పట్టణంలో సరైన చేపల మార్కెట్ లేకపోవడంతో కొనుగోలుదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌కు సరైన స్థలాన్ని కేటాయించడానికి అధికారులు చొరవచూపి, సమస్యను త్వరగా పరిష్కరించాలి.
– అప్పాల మహేందర్, కాజీపేట
స్థల సేకరణలో జాప్యం
ఇక్కట్లలో చేపల వ్యాపారులు,
వినియోగదారులు

మార్కెట్‌కు మోక్షమెప్పుడో..?