
డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించలేం
● కేయూ రిజిస్ట్రార్‌కు ప్రైవేట్ యాజమాన్యాల వినతి
కేయూ క్యాంపస్: ‘కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయడంలేదు.. దీంతో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం.. అందుకే రాబోయే రోజుల్లో యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల 2,4,6 సెమిస్టర్‌ల పరీక్షలు నిర్వహించలేం’ అని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు స్పష్టం చేశారు. ఈమేరకు శుక్రవారం రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్‌రావు మాట్లాడుతూ గత 20 నెలలకు సంబంధించిన ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల యాజ మాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దని, ఆర్‌టీఎఫ్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడంతో నిరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని యాజమాన్యాలు అప్పులు చేసి కళాశాలలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కళాశాలలు నిర్వహించే పరిస్థితి లేదని, ఈనెల 25 వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు చెల్లించని పక్షంలో ఏప్రిల్‌లో డిగ్రీకోర్సుల 2,4,6 సెమి స్టర్ల పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. రిజిస్ట్రార్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శి జి.వేణుమాధవ్, ఇతర బాధ్యులు ఉన్నారు.

డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించలేం