
ఓరుగల్లు కవి పరిమళాలు
నాటి పాల్కుర్కి సోమనాథుడు, మొల్ల, బమ్మెర పోతన తదితరుల నుంచి.. నేటి జైనీ ప్రభాకర్, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, ఆచార్య బన్న అయిలయ్య, మెట్టు మురళీధర్, అనిశెట్టి రజిత, అన్వర్, మహమ్మద్ సిరాజుద్దీన్, ఎన్వీఎన్ చారి, బిల్ల మహేందర్, బాలబోయిన రమాదేవి, గట్టు రాధికమోహన్, బిట్ల అంజనీదేవి, కార్తీకరాజు, చల్ల కుమారస్వామి వరకు ఎందరో కవులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. తిరగబడు కవులు, విప్లవకవులు, చేతనావర్త కవులు, జాతీయ కవులు, సీ్త్రవాద కవులు, తెలంగాణవాద కవులు.. ఇలా ఎవరు ఏ వాదాన్ని ఎత్తుకున్నా.. వారందరి ధ్యేయం సమాజాన్ని ముందుకు నడపడమే. భాషాభేదం లేకుండా తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ వివిధ భాషల్లో కవిత్వం రాస్తున్నారు.
కళలకు పుట్టినిల్లు..
వరంగల్ కళలకు, జానపద కళాకారులకు పుట్టినిల్లుగా చెప్పొచ్చు. కుల పురాణాలు చెప్పే జానపదులు, పద్యనాటకాలను ప్రదర్శించి సందర్భాన్ని బట్టి అలవోకగా సంభాషణను మారుస్తూ తమకు తెలియకుండానే కవిత్వాన్ని ఆశువుగా వల్లెవేయగలిగిన కళాకారులు వేలాది మంది ఇక్కడ ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మిగిల్చిన అనుభవాలను పాటలుగా పాడేవాళ్లు.. తత్వాలు పాడే గాయకులు, జానపద కథలు కళ్లకు కట్టినట్లు చెప్పే అమ్మమ్మలు.. ఇలా ఎందరో మౌఖిక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వరంగల్ జిల్లాలో ఉన్న జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఇప్పటి వరకు అనేక కళారూపాలపై డాక్యుమెంటేషన్ నిర్వహిస్తూ వాటిని సేకరిస్తున్నది. అలాగే, గ్రామాలకు సంబంధించిన విజ్ఞానాన్ని పుస్తకాల రూపంలోకి తీసుకొస్తోంది. యువ కవులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు చేస్తోంది. కాళోజీ కళా క్షేత్రంలో కవిత్వ పఠనం కోసం కూడా ప్రత్యేకంగా ఏసీ హాల్, కవుల కోసం లైబ్రరీ నిర్మించారు.
కవితా.. ఓ కవిత నా యువకాశల సుమపేశల నవగీతావరణంలో అంటూ శ్రీ శ్రీ లిఖించినా.. నగరాల్లో అత్యద్భుతంగా అస్థిపంజరాల్ని చెక్కే ఉలి ఆకలి అంటూ అలిశెట్టి ఆకలి పేగుల రాగాన్ని వర్ణించినా.. పల్లెటూరి పిల్లగాడ అంటూ ‘సుద్దాల’ జనపదాన్ని జనబాహుళ్యంలోకి తెచ్చినా.. ఓ చైతన్యం పరిఢవిల్లుతుంది. ఓ ఆవేశం ఉప్పొంగుతుంది. ఆ కవుల అడుగుజాడల్లో సమాజ చైతన్యానికి నడుం కట్టారు ఓరుగల్లు కవన సేవకులు. నేడు (శుక్రవారం) ‘అంతర్జాతీయ కవితా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – హన్మకొండ కల్చరల్
వ్యవస్థ జాగృతమయ్యేలాకవితాసేద్యం
స్ఫూర్తిగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా కవులు
వృత్తి ఏదైనా రచనల్లో మేటి
నేడు అంతర్జాతీయ కవితా దినోత్సవం
నిజ జీవితంలోనూ కవిత్వం..
నిత్యజీవితంలో ఎన్నో కవితాత్వక పదాలుంటాయి. రామసక్కనోడు, అక్క చుట్టమైతే.. లెక్క చుట్టం కాదు.. చిదిమి దీపం పెట్టవచ్చు. పొట్టివానికి పుట్టెడు బుద్ధులు వంటి పదాలు సామాన్యులు సైతం మాట్లాడుతుంటారు. కవులు మాత్రం తాము అనుకున్న అంశాన్ని విస్తృతం చేసి అందంగా, ఆనందం కలిగించేలా రాస్తారు. కవిత్వం ద్వారా ఎన్నో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లొచ్చు.
– ప్రొఫెసర్ భూక్య బాబురావు, పీఠాధిపతి,
జానపద గిరిజన విజ్ఞాన పీఠం, వరంగల్

ఓరుగల్లు కవి పరిమళాలు