
సభా వేదిక దేవన్నపేట !
సాక్షిప్రతినిధి, వరంగల్ : బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు గ్రేటర్ వరంగల్ పరిధి దేవన్నపేట శివారును నాయకులు ఎంపిక చేశారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేళ్ల పరిపాలనపై ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని భావించిన బీఆర్‌ఎస్.. వరంగల్ సభ ద్వారా ప్రారంభించాలని తలపెట్టింది. ఈనేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధి ఉనికిచర్ల, భట్టుపల్లి, దేవన్నపేట ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ముఖ్యనేతలు ఈనెల 10న స్థలాన్ని పరిశీలించారు. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. సభకు హాజరయ్యే జనం ఈజీగా వచ్చిపోయేలా ఉండాలని భావించి శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయభాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ తదితరులతో కలిసి హరీశ్‌రావు స్థల పరిశీలన చేశారు. జాతీయ రహదారి పక్కన ఉండడంతో పాటు నలుమూలల నుంచి వాహనాల ద్వారా వచ్చిపోయేందుకు దేవన్నపేట అనువుగా ఉంటుందని భావించి అధినేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చివరికి దేవన్నపేటను ఫైనల్ చేసినట్లుగా చెప్పారు. స్థలపరిశీలన అనంతరం హరీశ్‌రావు సుమారు గంటపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో మాట్లాడారు. సుమారు 15 లక్షల మందితో భారీ సభ నిర్వహించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే సమయంలో సభ సక్సెస్ కోసం ఉమ్మడి వరంగల్‌కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభా స్థలాన్ని
పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులు
విజయవంతానికి త్వరలో కమిటీలు.. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ?