
కొలతలు, తూకాల్లో మోసం
● సంబంధిత అధికారుల్లో నిర్లిప్తత
● నష్టపోతున్న వినియోగదారులు
● ప్రశ్నించి పోరాడితేనే దగాకు చెక్
నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
సాక్షి, వరంగల్:
మార్కెట్లో కొందరు వ్యాపారులు తూకాలు, కొలతల్లో వినియోగదారులను మోసం చేస్తున్నారు. కూరగాయలు, నిత్యావసారాలతోపాటు అన్నింటిలోనూ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అక్రమాలను అరికట్టాల్సిన తూనికలు, కొలతలు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం.. వినియోగదారుల హక్కులపై ప్రచారం చేయడంలోనూ విఫలమవడం ఇందుకు కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
కమిషన్‌ను ఎప్పుడు ఆశ్రయించాలంటే..
ఆన్‌లైన్ సేవలు విస్తృతం కావడంతో ఇంటి నుంచి వివిధ వస్తువుల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈనేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపార లావాదేవీలను కూడా వినియోగదారుల రక్షణ చట్టం–2019 పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా.. వాటి వల్ల నష్టం జరిగినా.. తూకాల్లో మోసాలకు పాల్పడినా పరిహారం కోరే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. నాణ్యతలేని, కల్తీ సరుకులు విక్రయించినప్పుడు.. కాలం చెల్లిన ఔషధాలు అమ్మినా.. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు విక్రయించినా.. ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం, సేవల్లో లోపం కారణంగా నష్టం వాటిల్లినా.. ఎలక్టాన్రిక్ పరికరాలు సక్రమంగా పని చేయకపోయినా.. విత్తనాలు, ఎరువులు, పురుగు ముందులు కల్తీ జరిగినా.. బ్యాంకులు, విద్యుత్ సంస్థలు, విమానయాన సంస్థలు, బీమా సంస్థలు అందించే సేవల్లో లోపాలు ఉంటే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు.
ఏ ఫిర్యాదు ఎక్కడ..
ఎంత నగదు?
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కన్జూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (వినియోగదారుల కమిషన్) పని చేస్తుంది. జిల్లా స్థాయి ఫోరం వస్తువులు/సేవల విలువ రూ.50 లక్షల్లోపు ఫిర్యాదులు పరిష్కరిస్తుంది. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య రాష్ట్ర స్థాయి, రూ.2 కోట్లకు మించిన విలువైన ఫిర్యాదులను జాతీయ స్థాయి ఫోరం పరిష్కరిస్తుంది. వస్తు సేవల్లో నష్టపోయి పరిహారం కోరాలనుకుంటే.. వివరాలను నాలుగు ప్రతులతో దరఖాస్తు చేయాలి. వస్తువుసేవల కొనుగోలు రుజువులు జతపర్చాలి. ఫోరం ఫీజు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రూ.200, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రూ.400, రూ.10 లక్షలు ఆపైన పరిహారం కోసం రూ.500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఫోరం స్వీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. వివిధ కారణాలతో తిరస్కరిస్తే ఫిర్యాదుదారుడు తనవాదన వినిపించవచ్చు. ఫోరంలో వినియోగదారుడే తన కేసును వాదించుకోవచ్చు. లేదా న్యాయవాదిని నియమించుకోవచ్చు.
వరంగల్‌కు చెందిన భద్రయ్య అనే వ్యక్తి ఓ హోల్‌సేల్ షాపులో కారం ప్యాకెట్ కొన్నాడు. ఇంటికి వెళ్లి తెరచి చూశాడు. అది కల్తీ కారం అని గుర్తించి షాపు యాజమాని వద్దకు వెళ్లి అడిగితే అతను గొడవకు దిగాడు.
శివనగర్‌కు చెందిన శ్రీను ఆన్‌లైన్‌లో ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సెల్‌ఫోన్ ఆర్డర్ చేశాడు. కొరియర్‌లో ఇంటికి వచ్చిన బాక్స్ తెరచి చూశాడు. అందులో పనిచేయని మొబైల్ ఫోన్ ఉండడంతో బిత్తరపోయాడు.