వరంగల్ క్రైం: కమిషనరేట్‌లో శనివారం కేయూ విద్యార్థి సంఘాల నేతలు, రిటైర్డ్ ప్రొఫెసర్లతో పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పీహెచ్‌డీ అడ్మిషన్ల వ్యవహారంలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న నిరసనలపై సీపీ మాట్లాడారు. విద్యార్థులు ఆరోపణల ప్రకారం పీహెచ్‌డీ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలతో పాటు వీసీ దృష్టికి తీసుకెళ్లాల్సిన ఇతర డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు లిఖిత పూర్వకంగా తెలియజేస్తే వీసీ దృష్టికి తీసుకెళ్తానని విద్యార్థులకు సూచించారు. సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ బారీ ఏసీపీలు జితేందర్‌రెడ్డి, కిరణ్‌కుమార్, ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్‌రావు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ రంగనాథ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. వ్యక్తులు గానీ, సంస్థలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టినా కఠిన చర్యలుంటాయని సీపీ హెచ్చరించారు.