
వరంగల్ : దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మికతకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భద్రకాళి ఆలయ సమీపంలో రూ.4.16 కోట్లతో నిర్మించిన ధార్మిక భవన్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమీకృత దేవాదాయశాఖ కార్యాలయంలో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, మేడారం సమ్మక్క–సారలమ్మ ఈఓ, ఇంజనీరింగ్ కార్యాలయాలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ మల్టీజోన్ పరిధిలోని 19 జిల్లాల్లో ఉన్న దేవాలయాలు ధార్మిక భవన్ పరిధిలోకి వస్తాయన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని దేవాలయాలను పర్యవేక్షించే కార్యాలయం హైదరాబాద్ తర్వాత వరంగల్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలు అభివృద్ధికి నోచుకున్నాయని వివరించారు. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప గుర్తింపు పొందేందుకు ఎంతో శ్రమించామని గుర్తుచేశారు. మాడవీధుల నిర్మాణానికి మంచి ప్లాన్ గీయించాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో పాలకుర్తి నియోజకవర్గంలో ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. శిథిలావస్థలో ఉన్న కాకతీయుల కాలం నాటి ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి, అధికారులను కోరారు. చీఫ్‌విప్ ధాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ భద్రకాళి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని, మాడ వీధులతో సుందరంగా తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో ద్‌కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమెల్సీ బస్వరాజు సారయ్య, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, ఎండోమెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, కుడా చైర్మన్ ఎస్.సుందర్‌రాజ్, హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్, గ్రేటర్ కమిషనర్ షేక్‌రిజ్వాన్‌బాషా, వరంగల్ జోన్ డీసీ శ్రీకాంతరావు, ఏసీ సునీత, ఈఈ చిమ్మని రమేష్‌బాబు పాల్గొన్నారు.
కల్యాణ మండపం త్వరగా పూర్తయ్యేలా కృషి
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపం పునర్నిర్మాణ పనులు పురావస్తుశాఖ పరిధిలో ఉన్నందున వారితో చర్చించి త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నగర పర్యటనలో భాగంగా వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి ఆలయాలను నాయకులతో కలిసి సందర్శించారు. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి
ఇంద్రకరణ్‌రెడ్డి
రూ.4.16 కోట్లతో నిర్మించిన
ధార్మిక భవన్ ప్రారంభం
