
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య
ఖిలా వరంగల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కేసుల పురోగతిపై వరంగల్, నర్సంపేట, మామునూరు, వర్ధన్నపేట డివిజన్ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. అట్రాసిటి కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి సకాలంలో చార్జ్‌షీట్ ఫైల్ చేయాలని ఆదేశించారు. పోలీస్ డిప్యూటీ కమిషనర్ పి.రవీందర్ మాట్లాడుతూ జిల్లాలోని వరంగల్ ఏసీపీ పరిధి–2, నర్సంపేట ఏసీపీ పరిధి–7, మామునూరు ఏసీపీ పరిధి–16, వర్ధన్నపేట ఏసీపీ పరిధి–2 కేసులు నమోదుకాగా వివిధ దశల్లో విచారణలో ఉన్నాయని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి, జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, డీటీడబ్ల్యూఓ ప్రేమకళ, ఏసీపీలు బోనాల కిషన్, పుప్పాల తిరుమల్, సతీష్‌బాబు, రఘుచందర్, జిల్లా ఎస్సీ అఽధికారి సురేష్, జిల్లా సంక్షేమాధికారి శారద తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలి
నిర్దేశిత గడువులోగా ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.