
పింగిళి కళాశాలలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్ సిక్తాపట్నాయక్
కలెక్టర్ సిక్తాపట్నాయక్
హన్మకొండ అర్బన్ : విద్యార్థినులు ఏకాగ్రతతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ సూచించారు. వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులకు బుధవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పింగిళి కళాశాలలో విద్యార్థినులకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని అత్యున్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుహాసిని, అకడమిక్ కోఆర్డినేటర్ డి.పార్వతి, పరీక్షల నియంత్రణాధికారి డి.రామకృష్ణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బ్యాంకుల్లో రుణమాఫీ నిధుల జమ
జిల్లాలో రూ.1లక్ష లోపు రుణమాఫీ పథకానికి సంబంధించిన నిధులు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. రుణమాఫీ, జీఓ 58, 59, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్, నివాస స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తాపట్నాయక్ బ్యాంకు ఖాతా వివరాలు అందించని రైతుల వివరాలు సేకరించి, పోర్టల్ బ్యాంకుల వారీగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హరితహారంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌కుమార్, వివిధ శాశాల అధికారులు పాల్గొన్నారు.
అనుమతి లేకుండా ఎరువులు
విక్రయిస్తే చర్యలు
కాజీపేట : ప్రభుత్వ అనుమతి లేకుండా ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేస్తామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ హెచ్చరించారు. కాజీపేట పట్టణంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ వ్యవసాయ అధికారులతో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులు, నిల్వలు, బిల్లు పుస్తకాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. డీఏపీని అధిక ధరలకు విక్రయిస్తే షాపుల లైసెన్స్‌లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్‌సింగ్, ఏడీఏ కె.దామోదర్‌రెడ్డి, ఏఓ దొండపాటి శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.