
ఎల్కతుర్తి మండలంలో పచ్చదనంతో కళకళలాడుతున్న వరిచేలు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ఈ వానాకాలంలోనూ వరిసాగుపైనే మక్కువ చూపారు. అంచనాలకు మించి 22 శాతం అదనపు విస్తీర్ణం పెరిగింది. గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి సాగుపై అనాసక్తి కనబరిచారు. అంచనాలకంటే 15.59 శాతం తక్కువ సాగైంది. ఇదే సమయంలో చిరుధాన్యాల సాగులోను వృద్ధి కనిపించలేదు. పంటమార్పిడిపై వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చేపట్టడంతోపాటు ఆయిల్‌పామ్‌వైపు మళ్లించే ప్రయత్నం చేసినా.. ఈసారీ వరిసాగుపైనే రైతులు మొగ్గు చూపారు.
లక్ష్యాన్ని మించిన వానాకాలం సాగు...
వ్యవసాయశాఖ ఈ వానాకాలంలో 14,82,605 ఎకరాల సాగు అంచనా వేసింది. జూలైలో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నా.. ఆ తర్వాత సాగు పుంజుకుంది. వ్యవసాయ శాఖ అంచనాలను మించి 15,01,608 (101.28 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. వరి 7,07,757 ఎకరాలు అంచనా కాగా 8,64,917 ఎకరాల్లో (122.20 శాతం) సాగైంది. పత్తి 6,37,759 ఎకరాల అంచనా కాగా.. 5,38,325 ఎకరాల్లో (84.41 శాతం) సాగు చేశారు. అందులో హనుమకొండ జిల్లాలో వరి 1,12,396 ఎకరాలకు 1,41,600, పత్తి 1,08,944 ఎకరాలకు 80,777, వరంగల్‌లో వరికి సంబంధించి 10,67,49ఎకరాలకు 1,29,377, పత్తి 1,30,908 గాను 1,22,476 ఎకరాల్లో సాగు చేశారు.
పెరుగుతున్న విస్తీర్ణం...
ఉమ్మడి వరంగల్ పరిధిలో ఎస్సారెస్పీ – 1, 2, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులు, రామప్ప, పాకాల, లక్నవరంలతో పాటు సుమారు 1,298 చెరువుల్లో పుష్కలంగా నీరుండడం... 67 వరకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం.. 10 మీటర్ల నుంచి 12 మీటర్లకు పడిపోయిన నీటిమట్టం 4.50 – 6 మీటర్లకు పెరగడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వరుణుడు కరుణించడంతో పెరిగిన భూగర్భ జలాలు, ఉచిత కరెంటు సరఫరాతో బోర్ల కింద పంటలు సైతం సాగవుతున్నాయి.
8,64,917 ఎకరాల్లో వరి.. అంచనాకు 22 శాతం అధికం
ఉమ్మడి వరంగల్‌లో సాగు లక్ష్యం 14,82,605 ఎకరాలు
15,01,608 ఎకరాల్లో
వివిధ పంటలు వేసిన రైతులు
తెల్ల బంగారంపై తగ్గిన మోజు..
లక్ష ఎకరాల్లో తగ్గిన అంచనా
ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక

ఉధృతంగా పారుతున్న ఎస్సారెస్పీ కాల్వ