
గణపయ్యా.. ఇలా వచ్చేరేంటీ?
గణపయ్యా.. సాకరాసికుంట, విద్యానగర్ కాలనీలో పర్యటిస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న అచ్చ వినోద్‌కుమార్ అనే వ్యక్తి తారసపడ్డాడు. గణపయ్యను చూసిన వినోద్‌కుమార్.. ‘మీరేమిటంటూ మండపంలో హాయిగా కూర్చోక ఇటుగా వచ్చారు’ అని అడగడంతో ‘ఎక్కడిదయ్యా.. దోమల బెడదతో ఉండలేకపోతున్నా’ అంటూ సమాధానమిచ్చాడు. ‘దేవరలు మరే అలా అంటే ఎట్ల’ అంటూ తన కాలనీలోని సమస్యను ఇలా చెప్పొకొచ్చాడు. ‘మావన్నీ ఓపెన్ డ్రెయినేజీలు. ఖాళీస్థలాలు మురుగునీరు నిల్వతో చెత్తాచెదారం పేరుకుపోయాయి. చెత్తను బల్దియా సిబ్బంది తీసుకెళ్లకపోవడంతో దోమలు పెరిగిపోతున్నాయి. దోమలు కుట్టేందుకు పగలు, రాత్రి తేడా లేదు.’ అంటూ తన బాధను వెలిబుచ్చాడు.
(వరంగల్ అర్బన్/ఖిలావరంగల్)
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అప్పుడే మూడు రాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజులపాటు భూలోకంలో పూజలందుకునేందుకు వచ్చిన గణనాథుడిని భక్తులు పూజలు, భజనలతో కీర్తిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ గణేశుడికి రాత్రి నిద్ర ఉండడం లేదట. నవరాత్రులు భక్తులు పెట్టే ఉండ్రాళ్లు, పులిహోర, పాయసం, దద్దోజనం తదితర ప్రసాదాలు పుష్టిగా తిని నిద్రపోదామంటే దోమలు కుడుతుండడంతో లేచి కూర్చుంటున్నాడట. అప్పటికే ప్రసాదాల భక్తాయాసంతో అటు, ఇటు నులవడం.. దోమ కుట్టగానే లేచి కూర్చోవడం. మూడు రోజులుగా ఇదే తంతట. ఓరుగల్లు ఎంతో చారిత్రకమైనది కదా.. ఒకప్పుడు రాజులు పాలించారు.. ఇప్పుడు స్మార్ట్ సిటీ.. స్వచ్ఛతలో ర్యాంకులు, పారిశుద్ధ్యంలో మేమే సాటి అంటూ గొప్పలు చెబుతున్నారు. మరెందుకు ఈ దోమలున్నాయి. దోమలకు కారణమేంది, వీటి గుట్టు తెలుసుకునేందుకు గణేశుడు.. తన మూషిక వాహనంపై నగర పరిశీలనకు బయలుదేరాడు.
(గ్రేటర్ వరంగల్ పరిధిలో
ఇటీవల దోమల బెడద తీవ్రమైంది.
దోమ కాటుతో నగర ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నగరవాసులు పడుతున్న దోమల బాధలను గణపయ్య పరిశీలించినట్లు ఇచ్చిన కథనం. ఇప్పటికైనా మేయర్, కమిషనర్
స్పందించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. )
హనుమకొండ హంటర్ రోడ్డు గుండా మూషికంపై ప్రయాణం మొదలుపెట్టాడు. ఒకవైపు భారీ భవంతులు చూస్తూ ముందుకు సాగాడు. ఎన్‌టీఆర్‌నగర్ బోర్డు చూసి కొంచెం లోపలికి వెళ్లి పరిసరాలను గమనించాడు. ఎక్కడ చూసినా మురుగుకాల్వలే. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచి ఉండి దురాస్వన భరించలేక తొండాన్ని మూసుకోలేక నానా అవస్థలు పడ్డాడు. పట్టపగలే దోమలు, ఈగలు ఆయన చుట్టూ ముసురుకున్నాయి. ‘ఇక్కడ కాసేపు ఉంటే అదేదో డెంగీ వస్తుందేమో.. మా తండ్రి శివయ్యకు తెలిస్తే నవరాత్రులు కూడా నన్ను ఇక్కడ ఉంచరు’.. అంటూ అక్కడినుంచి బయటపడ్డాడు. అక్కడినుంచి సంతోషిమాత కాలనీ, ఓఎస్ నగర్, రఘునాథ్ కాలనీ, పాపయ్యపేట చమన్, రామన్నపేట, పోతననగర్, గిరిప్రసాద్ నగర్, బీఆర్‌నగర్, డీకేనగర్, ఎంహెచ్‌ఓకాలనీ, సమ్మయ్య నగర్, కేఎల్ మహేంద్రనగర్ మీదుగా హనుమకొండ వైపు పర్యటన కొనసాగింది. మధ్యమధ్యలో ఆగుతూ మురుగుతో నిండిన డ్రెయినేజీలను చూస్తూ వస్తున్నాడు. అంతర్గత డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇళ్ల మధ్య మురుగు పారుతున్నట్లు గమనించారు. (అప్పుడప్పుడు తన చుట్టూ ముసురుకుంటున్న దోమలను అటు ఇటు కొట్టుకుంటూ)
ఇక.. పద్మాక్ష్మి కాలనీ, కాజీపేట దర్గా, పెద్దమ్మగ్డడ, లోటస్ కాలనీ, కుమార్‌పల్లి, యాదవనగర్, దీన్‌దయాళ్ నగర్‌ను చూసి వామ్మో అంటూ తనలో తాను ఒకింత భయాందోళనకు గురయ్యాడు. ఖమ్మం రోడ్డులోని కృష్ణ కాలనీలో ఇళ్ల మధ్యలో ఉన్న పిచ్చి మొక్కలను చూసి ‘కనీసం వీటిని తొలగించేందుకై నా ఇక్కడి పాలకులకు సమయం లేనట్లుంది’ అని తన మూషికంతో చెప్పుకొచ్చాడు.
అలా వెళ్తున్న ఆయనకు నాగమయ్య గుడి కనిపించింది. ‘మా తండ్రిగారి కంఠంపై ఉండే నాగేంద్రుడి ఆలయమా’ అంటూ.. వెంటనే వాహనం దిగి రెండు చేతులెత్తి ‘నాగేంద్ర’ అని మొక్కుకున్నాడు. పక్కనే ఉన్న ఇళ్ల వైపు తలతిప్పి చూడగా ఇళ్ల మధ్య ఎక్కడికక్కడ నిలిచిన మురుగు నీరు ఉంది. వాటిపై దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక.. ఆంధ్ర బాలికల కాలేజీ, బట్టల బజార్‌ను చూస్తూ ముందుకు సాగాడు. రోడ్ల వెంటనే చెత్తను తీసి వేయకుండా కుప్పలు పోశారు. వాటిపై ఈగలు, దోమలు ముసురుకున్నాయి.
అన్నీ గప్పాలేనా..
‘ఇక్కడి పాలకులేమో స్వచ్ఛతకు మారుపేరు, స్మార్ట్ సిటీ అంటూ గప్పాలు చెబుతున్నరు.. నగరం చూస్తే ఇట్లుంది.. అసలు దోమలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకునేందుకు గణపయ్య.. బల్దియా కార్యాలయం వైపు కదిలాడు. కార్యాలయం లోపల తనలాగే బొజ్జతో ఉన్న ఓ అధికారిని కలిసి... ‘ఏమిటయ్యా ఇది.. నగరంలో ఎక్కడ చూసినా దోమలే ఉన్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవట్లే’ అని ప్రశ్నించాడు. స్పందించిన ఆ అధికారి.. ‘అలా అంటావేంటి గణ పయ్యా.. మేము ప్రతి ఏడాది రూ.2కోట్లు ఖర్చుపెడతాం తెలుసా’ అంటూ బదులిచ్చారు. ‘ఏమి టీ.. ఏడాదికి రెండు కోట్లా’ అంటూ గణపయ్య.. నోరెళ్లబెట్టాడు. ‘నేను పుష్టిగా తిని బొజ్జ పెంచా.. వీళ్లు ఇలాంటి సొమ్మును తింటూ బొజ్జలు పెంచినట్లున్నారు’ అని లోలోన అనుకుంటూ తన మండపానికి తిరిగొచ్చి మరో ఆరు రోజులు నాకు ఈ దోమల కష్టాలు తప్పవా అంటూ నిట్టూర్చాడు.
కేయూసీ రోడ్డు..అమరావతి నగర్‌లో ఇలా..
న్యూస్‌రీల్
గణపయ్యకూ తప్పని దోమల బెడద
నిద్రకు దూరమై మూషికంపై నగర పరిశీలన..
స్మార్ట్ సిటీ, స్వచ్ఛ ర్యాంకులు ఉత్తవేనా..అంటూ అసహనం

సాకరాసికుంటలో డ్రెయినేజీలు లేక ఖాళీ స్థలంలో చెత్తాచెదారం, మురుగునీరు

41వ డివిజన్‌లో చెత్తతో నిండిపోయిన డ్రెయినేజీ