
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రాజేష్ చంద్ర
భువనగిరి : చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ముఠాను భువనగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తన కార్యాలయంలో భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లాకు చెందిన బోగి గణేష్, వరంగంటి నవీన్, దేవర రమేష్, బోగి నరేష్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టం రావడంతో హైదరాబాద్‌కు వెళ్లి ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వచ్చే డబ్బుతో అవసరాలు తీరకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 2వ తేదీన నలుగురు లాంగ్ డ్రైవ్ యాప్‌లో నంబర్‌లేని కారును బుక్ చేసుకున్నారు. ఆ కారులో హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తూ మార్గమధ్యలో ముందుగా వెళ్తున్న కారు నంబర్‌ను నోట్ చేసుకున్నారు. అనంతరం ఆ నంబర్ గల ప్లేట్‌ను తయారు చేయించుకుని తమ అద్దెకారుకు ఏర్పాటు చేసుకున్నారు. 3వ తేదీన ఉదయం 5గంటలకు వరంగల్ నుంచి జఫర్‌గఢ్, తిరుమలగిరి మీదుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. వలిగొండ మండలం వర్కట్‌పల్లి గ్రామ శివారుకు చేరుకోగానే రోడ్డు మీదుగా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళను బెదిరించి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు తీసుకుని, వాటికి ఉన్న రెండు పుస్తెలను ఆమెకి ఇచ్చి అక్కడి నుంచి పారిపోయారు. బాధిత మహిళ వలిగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఠా సభ్యులు మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో చైన్ స్నాచింగ్ పాల్పడేందుకు మేడిపల్లిలోని లాంగ్‌డ్రైవ్ సెంటర్‌కి వెళ్లి కారు అద్దెకు తీసుకున్నారు. చిట్యాలకు వెళ్తుండగా వలిగొండ మండలం నాగారం గ్రామం వద్ద పోలీసుల వాహనాల తనిఖీలో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి 33గ్రాముల పుస్తెలతాడు, 5 మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ రవికుమార్, చౌటుప్పల్ ఏసీపీ మొగులయ్య, రామన్నపేట సీఐ మోతీరాం, వలిగొండ ఎస్సై ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
మూడున్నర తులాల బంగారు
పుస్తెల తాడు స్వాధీనం