● అన్ని విభాగాల డీన్ల వెల్లడి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ రెండో కేటగిరీ ప్రవేశాలు పారదర్శకంగా నిర్వహించామని, ప్రవేశ పరీక్షల ఫలితాలు కూడా వెల్ల డించి కేయూ వెబ్‌సైట్‌లోనే అప్‌లోడ్ చేశామని ఆర్ట్స్, సైన్స్, సోషల్‌సైన్స్, లా, విద్య, ఇంజనీరింగ్, లా, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫార్మసీ విభాగాల డీన్‌లు బన్నఅయిలయ్య, మనోహర్, విజయలక్ష్మి, మల్లారెడ్డి, రాంనాథ్‌కిషన్, శ్రీనివాసులు, అమరవేణి, నర్సింహారెడ్డి మంగళవారం రాత్రి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌డీ రెండో కేటగిరీలో అడ్మిషన్లు నిష్పక్షపాతంగా చేశామన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే విజ్ఞాపన పత్రంతో డీన్లకు సమర్పించాలన్నారు. ఎక్కడైనా తప్పుదొర్లితే ఆ తప్పును సవరించేందుకు డీన్ల వద్ద ఉన్న సమాచారాన్ని పున:పరిశీలించి పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. పీహెచ్‌డీ రెండో కేటగిరీ అడ్మిషన్లపై కొద్దిరోజులుగా కొంతమంది సీటు రాని విద్యార్థి నాయకులు ఆందోళనలు చేయడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, డీన్ పదవికి రాజీనామ చేయాలని ఫోన్ల ద్వారా అధికారులను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. యూనివర్సిటీ ఆస్తులు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. విద్యార్థి నాయకుల చేష్టలను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యావాతావరణాన్ని దెబ్బతీస్తున్న వారికి మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు.