
వరంగల్ వేడుకల్లో మాట్లాడుతున్న డాక్టర్ బండా ప్రకాశ్
కరీమాబాద్: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ ఆజంజాహి మిల్ గ్రౌండ్(ఐడీఓసీ) మైదానంలో ఆదివారం జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలకు బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో పరిశ్రమలు, పర్యావరణం, పల్లె, పట్టణ ప్రగతి, సంక్షేమ పథకాలతో సబ్బండవర్ణాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విప్లవాత్మక పథకాలతో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అనంతరం తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించా రు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగ ల్ కలెక్టర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం, అదనపు కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినితానాజీ వాకడే, డీసీపీ రవీందర్, వరంగల్ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంఎల్‌సీ బస్వరాజు సారయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో వేడుకలు..
వరంగల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకావిష్కరణ చేసి జెండా వందనం చేశారు. అడిషనల్ కలెక్టర్లు శ్రీవత్స, అశ్వినితానాజీ వాకడే, ఆర్డీఓ వాసుచంద్ర, ఏఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్
వరంగల్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవం

ప్రదర్శన ఇస్తున్న విద్యార్థినులు
