
శ్రీను మృతదేహం
రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం శివారులో మిర్చి లోడుతో వెళ్తున్న ఓ మినీ గూడ్స్ టైర్ పంక్చరై రోడ్డు పక్కన నిలిపి ఉంచిన క్రమంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈఘటనలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెం రోళ్లబండ తండాకు చెందిన ధరావత్ శ్రీను(46) అక్కడికక్కడే మృతి చెందాడు. రైతులు వెంకన్న, భీమాకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అందులో భాగంగా 20 గుంటల్లో మిర్చి సాగు చేశాడు. మిర్చిని అమ్మేందుకు అతడి తమ్ముడు ధరవత్ భీమాకు చెందిన టాటా మినీ గూడ్స్‌లో మరో రైతు బానోతు వెంకన్నకు చెందిన మిర్చి బస్తాలను లోడ్ చేసుకొని మంగళవారం తెల్లవారుజామున వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు బయల్దేరారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం శివారులో మినీ గూడ్స్ పంక్చర్ అయింది. దీంతో వాహనాన్ని నిలిపి చూస్తుండగా.. ఖమ్మం నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న లగ్జరీ బస్సు వేగంగా మినీ గూడ్స్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. ఈఘటనలో తలకు బలమైన గాయాలవడంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. రైతులు వెంకన్న, భీమాకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అజాగ్రత్తగా నడిపి తన భర్త మృతికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ ఎ.భగవత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య ధారవత్ బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్సై సదానందం తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు..
నెక్కొండ: గుర్తు తెలియని వాహనం ఢీకొని నెక్కొండకు చెందిన చొప్పరి అశోక్(28) మంగళవారం మృతి చెందాడు. అశోక్ రెండు నెలల నుంచి అప్పల్‌రావుపేటలోని అమ్మమ్మ భద్రమ్మ వద్ద ఉంటున్నాడు. గ్రామంలోని ఊర చెరువులో చేపలు తీసుకొచ్చేందుకు బైక్‌పై వెళ్లాడు. ఈక్రమంలో గుర్తు తెలియని వాహనం ఊర చెరువు కట్టపై ఢీకొంది. ఈ ఘటనలో అశోక్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కెన్యాలో ధర్మరావుపేట రైతు..
ఖానాపురం: మండలంలోని ధర్మరావుపేటకు చెందిన పడకంటి బ్రహ్మచారి(55) కెన్యాలో మృతి చెందాడు. బ్రహ్మచారి ఇరవై ఏళ్ల క్రితం కెన్యాలోని తాంజానియాలో స్థిరపడ్డాడు. అక్కడ సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో పంట చేను వద్ద చెట్లపై ఉన్న తేనెటీగలు దాడి చేశాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు మంగళవారం మృతి చెందాడు. బ్రహ్మచారి గ్రామాభివృద్ధికి తనవంతుగా తరచూ సహకారం అందించేవారని గ్రామస్తులు కేఎన్‌చారి, కోటి, వెన్ను పూర్ణచందర్, విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ బాధ్యులు తెలిపారు.
ఊపిరాపిన ఫ్యాన్!
● ఊడిపడి బాలిక మృతి
పెద్దవంగర: గాలినివ్వాల్సిన ఫ్యాన్ ఊడి పడి ఓ చిన్నారిని ఊపిరిని ఆపేసింది. హాయిగా నిద్ర పోయిన చిన్నారి.. తీవ్రగాయాలై శాశ్వత లోకాలకు వెళ్లిపోయింది. నిద్రిస్తుండగా ఫ్యాన్ ఊడి పడి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రామచంద్రు తండాకు చెందిన జాటోతు యాకులు, లలిత దంపతుల మొదటి సంతానం శ్రావణి(9) మృతి చెందింది. శ్రావణి మూడో తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంట్లో కుటుంబీకులతో కలిసి నిద్రకు ఉపక్రమించింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు సీలింగ్ ఫ్యాన్ శ్రావణిపై పడింది. తీవ్ర గాయాలవడంతో తల్లిదండ్రులు తొర్రూరులోని ఓ పైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు మైరుగైన చికిత్స కోసం ఖమ్మంకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రావణి మంగళవారం మృతి చెందింది. తొమ్మిదేళ్లకే నూరేళ్లు నిండాయా అని తల్లిదండ్రుల రోదించిన తీరు తండా వాసులను కంటతడి పెట్టించింది.
నిలిచి ఉన్న వాహనాన్ని ఢీకొన్న బస్సు
అక్కడికక్కడే ఒకరి మృతి..
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

బ్రహ్మచారి(ఫైల్)

అశోక్(ఫైల్)

శ్రావణి (ఫైల్)

శ్రీను (ఫైల్)